హిందీ అర్జున్ రెడ్డి షూట్ లో వ్య‌క్తి మృతి

టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్‌, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వ‌ర్షెన్ తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ముస్సోరిలో జ‌రుగుతుంది. అయితే ఈ సినిమా షూట్ లో ఒకరు మృతి చెందినట్టుగా సమాచారం. చిత్ర యూనిట్ లో పని చేసే రాము కుమార్ (35) అనే వ్యక్తి జ‌న‌రేట‌ర్‌లో ఆయిల్ చెక్ చేసేందుకు వెళ్ళ‌గా ఆయ‌న మ‌ఫ్ల‌ర్ జ‌న‌రేట‌ర్ వీల్‌కి చిక్కుకుంది. దీంతో రాము త‌ల కూడా జ‌న‌రేట‌ర్ లోకి వెళ్ళిపోగా, అత‌ని త‌ల‌కి బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. ఈ విష‌యాన్ని గుర్తించిన చిత్ర బృందం వెంట‌నే రాముని డెహ్రడూన్‌లోని మ్యాక్స్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. త‌ల‌కి గాయం బ‌లంగా త‌గ‌ల‌డంతో అత‌ను ఆసుపత్రిలొ మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. రాముది స్వ‌స్థ‌లం ఉత్త‌ర ప్రదేశ్ కాగా, ఆయ‌న మ‌ర‌ణ వార్త విన్న కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మనిషి చనిపోవడంతో షూట్ ఆగినట్టు సమాచారం.