ప్రియాంక అందం మీద బీహార్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి ఝా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క అందంతో ఓట్లు రాలవు రాజకీయ అనుభవం కావాలంటూ ఆయన నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన మంత్రి వినోద్ నారాయణ ఝా ‘ప్రియాంక గాంధీ చాలా అందంగా ఉంటారు. కానీ ఆమెకు ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం, టాలెంట్ లేదు. ప్రియాంక భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్‌ వాద్రా భార్య అని ఆయన అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అభిమానులు మండిపడుతున్నారు. వినోద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నితిష్ కుమార్ మంత్రులకు తిట్లు నేర్పేందుకు ఓ సంస్థను నడుపుతున్నారంటూ ఫైరయ్యారు. వినోద్ మాత్రమే కాదు.. ప్రియాంక గాంధీ పొలిటికల్‌ ఎంట్రీపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి కలిసొస్తుందన్నారు. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చడం నవ్వు తెప్పిస్తోందని సెటైర్లు పేల్చారు.