రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గకూడదు అనే భావనలో ఉంటారు మన మందుబాబులు. ఇదే స్ట్రాటజీ బ్రాండ్ విషయంలో కూడా బాగా ఫాలో అవుతారు అందుకే బ్రాండ్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. కిరాణా కొట్టులోనో, ఆరోగ్యం కోసం వేసుకునే అల్లోపతీ మందులోనో నచ్చిన బ్రాండ్ వస్తువులు లేకపోతే వేరేవాటితో రాజీ పడతారేమోగానీ ఇష్టమైన బ్రాండ్ మద్యం లేకపోతే అస్సలు మనసు కుదురుగా ఉండదు మనోళ్ళకి. అలాంటి వ్యక్తుల్లో ఒకరు జగిత్యాల పట్టణానికి చెందిన తనకు ఇష్టమైన ‘కింగ్ ఫిషర్’ బీర్ బాటిళ్ల కోసం ఏకంగా కలెక్టర్ కు లేఖ రాయడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయంగా మారింది.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా అక్కడ సెటిలయినప్పటి నుండి కింగ్ ఫిషర్ అమ్మకాలు జరగడం లేదు.కానీ తెలంగాణకు చెందిన కింగ్ ఫిషర్ లవర్ మాత్రం ఆ బ్రాండ్ అమ్మకాలు ప్రారంభం అయ్యేలా చూడమని ఏకంగా ప్రభుత్వానికే(కలెక్టర్) కే అర్జీ పెట్టుకోవడం సంచలనంగా మారింది. జగిత్యాలతో పాటు మరికొన్ని మండలాల్లో కింగ్ ఫిషర్ బీర్ విక్రయించడంలేదంటూ పట్టణానికి చెందిన అయిల సూర్యనారాయణ (టీవీ సూర్యం) ఆవేదన వ్యక్తం చేస్తూ మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి స్థానిక వైన్‌షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొన్నేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేశారని, తమ ఫేవరేట్ బీర్ అమ్మకాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు ప్రజావాణిలో సోమవారం (సెప్టెంబర్ 24) ఫిర్యాదు చేశారు.
‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారు. జగిత్యాల పట్టణం, పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపివేశారనే అంశంపై విచారణ జరిపించాలి. మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు, కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నా’ అని సూర్యం తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్ళారు జగిత్యాల కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ఈ విషయంపై వివరాలు కోరగా.. మద్యం వ్యాపారులు రెండేళ్లుగా జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు అమ్మకాలను నిలిపేసినట్లు తెలిపారు. వీటిని విక్రయించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలిపారు. అయినా ఓ బ్రాండ్ బీర్ల అమ్మకాల గురించి మద్యం వ్యాపారులను తాము ఒత్తిడి చేయలేమని అయినప్పటికీ ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.