Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని భాషపై మాజీ ప్రధాని అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని భాష మార్చుకోవాలని మీరైనా హితభోద చేయండి అని రాష్ట్రపతిని సైతం కోరారు మాజీ ప్రధాని. పదేళ్లు దేశప్రధానిగా పనిచేసి మౌనమునిగా గుర్తింపు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ కు మోడీ మాటలు హద్దులు దాటుతున్న భావన కలుగుతోంది. అందుకే మోడీకి హితోపదేశం చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతున్నారు మన్మోహన్. మోడీ సభల్లో, సమావేశాల్లో ఉపయోగిస్తున్న భాష ఇబ్బందికరంగా ఉంటోందని ఆరోపిస్తూ మన్మోహన్ రాష్ట్రపతికి లేఖ రాశారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న హుబ్బెళ్లిలో నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మోడీ ఉపయోగించిన భాష తమకు అభ్యంతరకరంగా ఉందని మన్మోహన్ ఆ లేఖలో ఫిర్యాదుచేశారు.
కాంగ్రెస్ నేతలపై ప్రధాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఆయన వాడిన భాష కూడా ఏమీ బాగాలేదని మన్మోహన్ విమర్శించారు. అవి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని, ఆయన భాషకు హాని కలిగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఆయన్ను గమనిస్తుంటారని, కాస్త ఆయన భాష మార్చుకొమ్మని మీరైనా హితబోధ చెయ్యండని రాష్ట్రపతిని కోరారు మాజీ ప్రధాని. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మన్మోహన్ తన లేఖలో హెచ్చరించారు. లేఖతో పాటు ప్రచారంలో మోడీ మాట్లాడిన వీడియో లింక్ ను జత చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పి. చిదంబరం, ఆనంద్ శర్మ, అంబికా సోనీ, మల్లికార్జున్ ఖర్గే, మోతీలాల్ వోహ్రా, కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కరణ్ సింగ్ లు ఈ లేఖలో సంతకంచేశారు.