లేఖ విడుదల చేసిన మావోలు…నిజమైనదేనా…!

Maoist Letter Halchal In Visakha Agency

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యపై మావోయిస్టుల పేరుతో ఓ లేఖ విడుదలైంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన లేఖలో గిరిజన ద్రోహానికి పాల్పడుతున్నందుకే వారిని ప్రజాకోర్టులో శిక్ష విధించామని పేర్కొన్నారు. కిడారి బాక్సైట్ కు అనుకూలంగా మారుతున్నారని ఆరోపించారు. గూడ క్వారీ విషయంలో ఆయనను ఎన్నో సార్లు హెచ్చరించాం..అయినా పద్దతి మార్చుకోలేదన్నారు మావోలు. పోలీసులకు మాకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. అందుకే ఆయుధాలతో దొరికినా పోలీసులకు ఎటువంటి హాని చేయలేదన్నారు. గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు కిడారిని హెచ్చరించినా పట్టించుకోకుండా బాక్సైట్‌ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు. అందుకే ప్రజాకోర్టులో శిక్షించాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వారిద్దరికి రక్షణగా వచ్చిన పోలీసులను మానవతా దృక్పథంతో వదిలిపెట్టామని, ఆయుధాలతో చిక్కినా చంపలేదన్నారు. అలా మావోయిస్టులు దొరికితే పోలీసులు వదిలిపెడతారా అంటూ ప్రశ్నించారు.

moists

letter
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆ లేఖలో తీవ్రంగా హెచ్చరించారు. ‘‘అధికార పార్టీకి తొత్తుగా మారావు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయావు. అలాంటి నీవు మాకు నీతులు చెబుతావా? ప్రజాకోర్టు సందర్భంగా నీ గురించీ కిడారి చెప్పారు. నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలి. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాలి. లేదంటే, వారికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఆ లేఖలో హెచ్చరించారు. కాగా, ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టులు ఎప్పుడైనా, ఏదైనా సమాచారం పంపితే వాడే కాగితాలు గానీ, అందులో ఉపయోగించే భాషగానీ భిన్నంగా ఉంటాయి. దీంతో ఇవి నిజంగా మావోయిస్టులే విడుదల చేశారా లేక.. వేరేవాళ్లు విడదుల చేసి మావోల పేరు వాడుతున్నారన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.