మూడేళ్ల క్రితం అదృశ్యమైన భర్తను ఓ టిక్ టాక్ వీడియో దొరికించింది. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన సురేశ్, జయప్రద దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా సురేశ్ 2016లో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు కూడా జయప్రద ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. కొన్ని వారాల క్రితం జయప్రద బంధువు ఒకరు.. టిక్ టాక్ వీడియోలు చూస్తుండగా.. సురేశ్ వీడియో ఒకటి కంటపడింది. దీంతో ఆ బంధువు అప్రమత్తమై జయప్రదకు సమాచారం అందించింది.
ఆ తర్వాత తన భర్త సురేశ్ ఉన్న టిక్ టాక్ వీడియోను పోలీసులకు చూపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సురేశ్ హోసూరులో ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియోలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో సురేశ్ కలిసి ఉన్నాడు. ఈ సమాచారం ఆధారంగా ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో సురేశ్ ఆచూకీ కనుగొన్నారు. హోసూరులో మెకానిక్‌గా పని చేస్తున్న సురేశ్.. ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉంటున్నాడు. మొత్తానికి ఎన్జీవో, పోలీసుల సహకారంతో సురేశ్, జయప్రద ఒక్కటయ్యారు. సురేశ్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కృష్ణగిరికి పంపించారు.