Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కార్ ని ఢీకొట్టాలంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రతో సాధ్యం కాదని భావిస్తున్న వైసీపీ నెగటివ్ ప్రచారం మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రకుల పేదలకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా కాపులు, బ్రాహ్మణుల కోసం కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడమే కాకుండా 1000, 500 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఈ పరిణామం తో బిత్తరపోయిన వైసీపీ ముందుగా ముద్రగడని అడ్డం పెట్టి కాపు రిజర్వేషన్ అంశంతో సర్కార్ మీద ఆ వర్గంలో వ్యతిరేకత పెంచేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో తుని విధ్వంసం తో అగ్గి రాజేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవహారంలోనూ ఇదే ప్లాన్ అమలు చేయబోతోంది.
ఐవైఆర్ కృష్ణారావు ని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాక గుంటూరు లో ఆ వర్గం వారితో వైసీపీ ఓ సభ తలపెట్టింది. ఈ నెల 25 న గుంటూరు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో ఈ సభ తలపెట్టారు. బాపట్ల లో బ్రాహ్మణ కార్పొరేషన్ సభ నిర్వహించిన సందర్భంలో ఐవైఆర్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిని కలవడం విమర్శలకి దారిచ్చింది. ఇప్పుడు అదే ఎమ్మెల్యే గుంటూరు లో వైసీపీ తరపున సభ ఏర్పాటు చేయడమే కాకుండా లోపాయికారీగా ఐవైఆర్ పిలుపు మేరకే ఇది ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ సభకు ఐవైఆర్ కూడా వస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే రెండు రోజుల కిందట తనకి రాజకీయ లక్ష్యాలు, దురుద్దేశాలు అంట కట్టడం తగదని చెప్పిన ఐవైఆర్ కృష్ణారావు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదా ఆ సభ వైసీపీ తరపున ఏర్పాటు చేస్తోందని చెప్పవలసి ఉంటుంది. గుంటూరు సభతో వైసీపీ నిజంగానే ఐవైఆర్ కృష్ణారావుకి శీలపరీక్ష పెట్టింది. ఈ పరీక్షలో ఆయన ఎలా నెగ్గుతారో చూడాలి. లేదా మౌనం ఏమీ ఎరగనట్టు ఉంటే మాత్రం మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి ఉంటుంది.