వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు మీద మరో సారి విరుచుకు పడ్డారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పూటకో స్టంట్ చేస్తున్నారని వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని అలాంటిది మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు. వైఎస్ జగన్ బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వస్తున్నారన్న ఆమె వచ్చే ప్రతి నాయకుడు తమ పదవులకు రాజీనామాలు చేసి వస్తున్నారని అది వైఎస్ జగన్ నైతిక విలువలకు నిదర్శనని అన్నారు.
చంద్రబాబు మాత్రం వైసీపీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. పుల్వామా ఉగ్రవాద దాడి ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ధాని మోదీ రాజీనామా చేయాలనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారని మరి చంద్రబాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. పాక్ ఉగ్రవాదుల చర్యకు మోదీని రాజీనామా చెయ్యమంటున్న చంద్రబాబు ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొన్నందుకు ఎందుకు రాజీనామా చెయ్యలేదని నిలదీశారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఒక రైతును దారుణంగా కొట్టి చంపారని ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.