Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ మెట్రో నగరంగా మారింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెట్రో రైలు పరుగులు తీసింది. ఎన్నో ప్రత్యేకతల కలబోతైన భాగ్యనగరి మెట్రో రైలును ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మియాపూర్ వచ్చిన మోడీ ముందుగా పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడే మెట్రో రైలు ప్రారంభించారు. తర్వాత మెట్రో స్టేషన్ మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని ప్రాజెక్టు, నగర పునఃనిర్మాణంపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను ప్రారంభించారు. రెండో అంతస్తులోని ఫ్లాట్ ఫాంకు చేరుకుని మెట్రో రైలు ఎక్కారు.
రైలులో ఆయన కూకట్ పల్లి వరకు ప్రయాణించి తిరిగి మళ్లీ మియాపూర్ చేరుకున్నారు. ట్రైన్ లో మోడీకి ఓ పక్కన తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో పక్క గవర్నర్ నరసింహన్ కూర్చున్నారు. మోడీని చూసేందుకు మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, తొలి దశలో మెట్రో రైల్ 30కిలోమీటర్ల మేర పరుగులు తీయనుంది. రేపు ఉదయం ఆరుగంటల నుంచి హైదరాబాదీలకు అందుబాటులోకి వస్తుంది. రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు సర్వీసులు నడుపుతారు. మొత్తం 18 రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.