Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ పూర్తిగా ఏపీ మీద ద్రుష్టి పెట్టనుందా ? మే 15న కన్నడ ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అందిన వెంటనే ఏపీలో ఏం జరగబోతుంది ? ఏపీలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పబోతుందా? చక్రం తిప్పి చంద్రబాబుని కార్నర్ చేసే ప్రయత్నంలో ఉందా ? అనే ప్రశ్నలకి చంద్రబాబు మాటలు వింటుంటే నిజమేననిపిస్తోంది. విశాఖ నుంచి విజయవాడకు ఆకస్మాత్తుగా వచ్చిన గవర్నర్ నరసింహన్ చంద్రబాబుతో గంటన్నరపాటు సమావేశమయ్యారు. వీరి మధ్య ఏం చర్చ జరిగిందో తెలియదు. కానీ గవర్నర్ చంద్రబాబుని హెచ్చరించినట్టు దానికి చంద్రబాబు తలొగ్గనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమి జరిగిందో ఏమో మరుసటి రోజే ఢిల్లీ బాట పట్టారు గవర్నర్. ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోడీతో భేటీ అయ్యారు నరసింహన్.
ప్రధానితో గవర్నర్ మీటింగ్ లోనే ఏపీ మీద కమలదండు అమలు చేయాల్సిన ప్లాన్ రెడీ కాబోతుందని తెలుస్తోంది. వచ్చే ‘మూడు నెలల్లో ఏమవుతుందో మీరే చూడండి’ అంటూ ఏపీ బీజేపీ ట్రబుల్ షూటర్ రామ్‌మాధవ్ చేసిన హెచ్చరిక… తదనంతర పరిణామాలు చూస్తే అనుమానాలు కలుగక మానవు అలాగే 2003 నాటి అలిపిరి అనుభవమే 2019లో చంద్రబాబు ఎదురవుతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించడం మరిన్ని సందేహాలని కలిగిస్తోంది. మరోపక్క మే 15 తర్వాత తెలుగుదేశం పార్టీకి షాక్ ట్రీట్మెంట్ తప్పదంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.
ఇప్పటికే వైసీపీ బలపడుతోందంటూ డైరెక్ట్ గానే మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది బీజేపీ. అంతేకాక నిన్నటి సభలో బాబు మాటలని బట్టి చూస్తే బీజెపీ ఎదో గట్టి ప్లాన్ లోనే ఉన్నట్టు అర్ధం అవుతోంది. టీడీపీ మీద జరుగుతున్న కుట్రని గురించిన బాధ ఆయనమాటల్లో ధ్వనిస్తోంది. తాను అభిమన్యుడిగా పద్మవ్యూహంలో చిక్కుకున్నపుడు… రక్షణచట్రంగా ప్రజలే ఉండాలంటూ చెప్పటం ఇపుడు తెలుగు తమ్ముళ్ళలోను గుబులు పుట్టిస్తోంది. అయితే మోదీ పగ బడితే ఆ పగ ఎలా ఉంటుందో చంద్రబాబుకు చూపించేలా బీజేపీ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి హీరో శివాజీ బట్టబయలు చేసిన ఆపరేశన్ గరుడ అంశాన్ని కూడా జోడిస్తే రానున్న కాలంలో రాజకీయం ఎన్ని మలుపులు తిరగనుందో. అపర చాణక్యుడుగా పేరున్న చంద్రబాబు ఈ పద్మవ్యుహాన్ని ఏ విధంగా చేదిస్తాడు అనేది వేచి చూడాలి.