Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అచ్చంగా ఆకాశాన విహరిస్తున్నట్టుగా రాజకీయ పయనం సాగించిన ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు గుజరాత్ ఫలితాలతో భూమ్మీదకు వచ్చారా…? అన్ని రాష్ట్రాల్లో పాగా వేయలనే లక్ష్యంలో భాగంగా టీడీపీకి దగ్గరగా ఉంటూనే దూరంగా జరిగి… ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్న మోడీ, షాలు గుజరాత్ ఫలితాల తర్వాత తమ ఆలోచన విరమించుకున్నారా..? హిందూవాదం, బీజేపీ బలంగా ఉండే గుజరాత్ లోనే చచ్చీచెడీ దక్కించుకున్న గెలుపు మిత్రపక్షాలను దూరం చేసుకోకూడదన్న పాఠం నేర్పిందా… తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కొన్ని నెలల క్రితం టీడీపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని, వైసీపీతో అంటకాగే ఉద్దేశంలో ఉన్న మోడీ జగన్ కు అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అదేసమయంలో చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు మాత్రం మోడీ నిరాకరించి ఆయన్ను తీవ్రంగా అవమానపరిచిన విషయం ఏపీ ప్రజలందరికీ గుర్తుంది. అయితే ఇది గతం. ఇప్పుడు మోడీ, షాల వైఖరిలో మార్పు వచ్చింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీసీ ప్రతిష్టాత్మకంగా భావించిన నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచినప్పడే కొంత మారిన మోడీ, షాలు గుజరాత్ ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయారు. ఏపీపై బీజేపీ చిన్నచూపు నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశముందన్న విశ్లేషణలు హోరెత్తుతున్న నేపథ్యంలో వారు వ్యూహం మార్చారు. కాంగ్రెస్, టీడీపీ కలిస్తే బీజేపీకి కలిగే నష్టాన్ని అంచనావేసి… జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. చంద్రబాబుకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనను కలిసిన ఏపీ ఎంపీలతో మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
రెండు, మూడు రోజుల్లో తాను, చంద్రబాబు భేటీ అవుతామని మోడీ వారితో చెప్పారు. ఒకప్పుడు బాబుకు అపాయిట్ మెంట్ నిరాకరించిన మోడీ ఇప్పుడు స్వయంగా తానే చంద్రబాబుతో సమావేశం గురించి చెప్పడంతో ఎంపీలంతా షాక్ తిన్నారు. అంతేకాదు… ఎంపీలతో ఏపీకి సంబంధించిన ఎన్నో విషయాలపై మోడీ అత్యంత సానుకూలంగా మాట్లాడారు. తాను, చంద్రబాబు కలిసినప్పుడు పెండింగ్ అంశాలన్నింటిని చర్చించి ఏపీకి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీఇచ్చారు. అలాగే ఏపీకి సాయం చేయడానికి తాను అన్నివేళలా కృషిచేస్తానని కూడా మోడీ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయా అని కూడా ప్రధాని అన్నారు. పోలవరం విషయంలో పూర్తిగా సహకరిస్తున్నామని, అలాగే అన్ని హామీలూ త్వరలోనే నెరవేరుస్తామని కూడా ప్రధాని తెలిపారు. టీడీపీ విషయంలో మోడీ, షాల వైఖరి పూర్తిగా మారిందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం.