Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ వ్యవహారశైలి ఎవరికీ అంతుబట్టదు. ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతారో… ఎప్పుడు విమర్శిస్తారో అర్ధం కాదు. అలాగే ఎవరిని ఎందుకు అక్కున చేర్చుకుంటారో… మరెందుకు దూరంగా విసిరేస్తారో ఊహించలేం. ఆయన ఆలోచనలు, ప్రవర్తన అంతా అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే అయినా అనూహ్యరీతిలో సాగుతుంటాయి. టీడీపీతోనూ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఆయన వ్యవహారశైలి ఇందుకు నిదర్శనం. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లపాటు… చంద్రబాబుతో మోడీ చాలా సఖ్యతగా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా వైఖరి మార్చుకున్న మోడీ… జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేశారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీతోనూ మోడీ తీరు ఇలానే మారిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అద్వానీకి వంగి వంగి దండాలు పెట్టిన మోడీ… మొన్న త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా వేదికపై అందరిముందూ ఆయనతో అవమానకరంగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇవేకాదు.. అనేక పార్టీలతో ఆయన వ్యవహారశైలి ఒక్కోసారి ఒక్కోతీరులో సాగుతుంది.
తొలినుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మోడీ అంటీముంటనట్టే వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత మాత్రం కేసీఆర్ మోడీకీ చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో టీఆర్ ఎస్ కేంద్రమంత్రివర్గంలో చేరుతుందని, ఎంపీ కవితకు మంత్రి పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగకపోయినా… కేంద్రంతో కేసీఆర్ స్నేహపూర్వకంగానే మెలిగారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు పలికారు. ఇలాంటి పరిణామాలు కొన్నిరోజుల క్రితం ఒక్కసారిగా మారిపోయాయి. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశంలో ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలకు దిగారు. ఒకానొక స్టేజ్ లో మోడీగాడు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం… తర్వాత కేటీఆర్, కవిత సర్దిచెప్పడం కూడా జరిగాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్… ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ను ప్రధాని మోడీ ప్రత్యర్థిగా భావించాలి. తృతీయ కూటమి ఏర్పాటుతో బీజేపీకి పోటీగా నిలుస్తున్నందుకు కేసీఆర్ పై ఆగ్రహంతో ఉండాలి. కానీ విచిత్రంగా ప్రధానిలో ఇలాంటి భావమే లేదు. ఇంకా చెప్పాలంటే టీఆర్ ఎస్ ను మోడీ మిత్రపక్షంగా కూడా భావిస్తున్నారేమో…
ఈ అభిప్రాయం కలగడానికి కారణం కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత 39వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని వ్యవహరించిన తీరే. కవితకు ప్రధాని ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా… తెలుగులో లేఖ రాశారు. దేశ ప్రజలకు సేవలందించేందుకు గానూ భగవంతుడు దీర్ఘకాలంపాటు ఆరోగ్యం, సంతోషం ఇవ్వాలని కోరుకున్నట్టు ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ మోడీపైనా, కేంద్రప్రభుత్వంపైనా తీవ్రవిమర్శలు చేస్తూ. థర్ట్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయన కూతురుకి ప్రధాని ఇలా అమిత ప్రాధాన్యం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే సమయంలో మోడీతో కుమ్మక్కయిన కేసీఆర్ ఆయనకు లబ్దిచేకూర్చేందుకే థర్ట్ ఫ్రంట్ ఆలోచనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.