Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 లో సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసినప్పటినుంచి బీజేపీ విస్తరణ మీద మోడీ, షా ద్వయం దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారమూ లేదా ప్రతిపక్ష పాత్ర ఏదో ఒకటి ఉండటంతో అక్కడ బీజేపీ కి పెద్ద అసంతృప్తి లేదు. అయితే దక్షిణాది విషయంలో అలా కాదు. ఒక్క కర్ణాటక మినహా మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తోక పార్టీ గానే మిగిలిపోయింది బీజేపీ. ఆ పరిస్థితిని బ్రేక్ చేసి దక్షిణాదిన పాగా వేయడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా వంటి హామీల్ని తుంగలో తొక్కి మరీ మిత్రపక్షం టీడీపీ ని ఇబ్బంది పెట్టడం , కేరళలో మతాల మధ్య విభేదాల్ని రాజకీయం చేయడం,తమిళనాట జయ మరణానంతర పరిస్థితుల్ని వాడుకోవడం, తెలంగాణాలో కెసిఆర్ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టడం ద్వారా దక్షిణాదిన పాగా వేయడానికి బీజేపీ ట్రై చేసింది. అయితే కమలం పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని ఓ దండయాత్ర తరహాలో చూసారు దక్షిణాది ప్రజలు. అందుకే అధికారంలో వచ్చిన ఇన్నేళ్ళలో ఆ పార్టీ బలం దక్షిణాదిన పెరగడం మాట అటుంచి తగ్గిపోయింది. ఇది నిజంగా బీజేపీ స్వయంకృతాపరాధమే. ప్రతి చోటా ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలని చిన్న చూపు చూసింది. ఆ పార్టీలు బలహీనపడితే తాము బలపడొచ్చని అనుకుంది తప్ప ఆయా రాష్ట్రాల సహజ రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు.
బీజేపీ కరుడుగట్టిన రాజకీయం చేసినప్పటికీ తమిళ తంబీలు సరైన నాయకత్వం లేకపోయినా ఆ పార్టీని నిలువరించడం ద్వారా మిగిలిన రాష్ట్రాల ప్రజల్లో స్ఫూర్తి నింపారు. జయ మరణం తరువాత పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలచుకుని పన్నీర్ సెల్వం ని కుర్చీలో కూర్చోబెట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ప్రజాబలం లేని శశికళ ముందు కూడా నిలవలేదు. జల్లికట్టు ఉద్యమ వేడి చూసి ఆచితూచి అడుగులు వేసినా బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడింది లేదు. ఇప్పుడు మెర్సెల్ చిత్రంలో జీఎస్టీ మీద విమర్శల్ని అడ్డుకోడానికి ప్రయత్నించి మరో సారి తమిళ తంబీల వేడి ఎలా ఉంటుందో రుచి చూసింది మోడీ,షా ద్వయం. తంబీల పోరాట పటిమ చూసాక బీజేపీ ని వదిలించుకునే ధైరం చేయడానికి చంద్రబాబుకి నమ్మకం కలిగింది. కెసిఆర్ లో విశ్వాసం ఎక్కువైంది. కమ్యూనిస్టుల్లో కొత్త ధైర్యం వచ్చింది. ఇప్పటికైనా బీజేపీ కళ్లుతెరిస్తే దక్షిణాదిన మిత్రపక్షాలు అయినా మిగులుతాయి లేదంటే రాజకీయ ఏకాకి అయ్యే ప్రమాదం పొంచి వుంది.