ఇటీవల తెలంగాణలో జరిగిన రసవత్తర పోరులో ఎన్నికల ఫలితాలకు ముందు పరిస్థితి ఒకలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఊహించని రీతిలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయటంతో అంతా కలిసి చంద్రబాబుదే తప్పన్నట్టు నెపం ఆయన మీదకి నెట్టేశారు. ప్రజాకూటమితో జతకట్టినప్పుడు బాబే బలం అని చెప్పిన కాంగ్రెస్ నేతలు తీరా ఫలితాల అనంతరం ఓటమికి కారణం చంద్రబాబే అని ఆయన పై అభాండం మోపారు. మరోవైపు గులాబీ దళ అధినేత కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు గురించే మాట్లాడి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించటం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత నుంచి ఊహించని రీతిలో చంద్రబాబుకు సపోర్ట్ లభించటంతో అంతా షాక్ అయ్యారు. కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత బాబుపై సానుభూతి ప్రకటించటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓ వైపు బాబుతో పొత్తు కలిసిన కాంగ్రెస్ నేతలే ఓటమికి బాబును కారణంగా చూపుతున్నారు.
మరోవైపు కవిత తండ్రి కేసీఆర్ కూడా బాబుపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. అలాంటిది ఈ సందర్భంలో కవిత జ్యోక్యం చేసుకొని ప్రజాకూటమి ఓటమిలో బాబుపై నిందలు వేయటం సరికాదని పేర్కొనటం చర్చనీయాంశం అయింది. ఆమె మాట్లాడిన మాటలు చూస్తే అందులో చాలా నిజానిజాలు దాగి ఉన్నాయండోయ్. నిన్న మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు.. తీరా ఇప్పుడేమో చంద్రబాబు పొత్తు వల్ల ఓడిపోయాం అని అంటున్నారు. కూటమి ఓటమిలో అసలు చంద్రబాబు తప్పే లేదు. నిజానికి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసినప్పుడే కాంగ్రెస్ ఓడిపోయింది. అసెంబ్లీ రద్దు తర్వాతే వాళ్లంతా కలిసి కూటమి కట్టారు. అప్పుడే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక కుంటి సాకులు చెబుతూ ఇక చేసేదేం లేక ఆ నిందను చంద్రబాబుపై వేస్తున్నారని ఆమె అన్నారు. ఈ విషయం బాబుకు ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ.. ఇక్కడ మనం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గమనించాలి. తండ్రి కేసీఆర్ బాబును తిడుతూ రిటర్న్ గిఫ్టులివ్వడానికై ఏపీకి ఎన్నికల టైమ్‌లో వస్తానంటూ బెదిరిస్తుండగా కూతురు మాత్రం బాబుపై ఇలా సాఫ్ట్ కార్నర్ చూపించడానికి కారణం ఏమిటి? అందుకు గల కారణాలేంటి? ఇదే ఇప్పుడు విశ్లేషకులు కూడా తేల్చలేకపోతున్నారు ఏదిఏమైనా ఇన్నాళ్లు బాబుపై మోపిన నిందను మాత్రం స్వయానా టీఆర్ఎస్ ఎంపీ కవితనే కొట్టిపారేయటం గమనార్హం.