Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీలో పరిణామాలు వేడెక్కాయి. విభజన బాధిత ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగేళ్లగా వాటిని నెరవేర్చలేదు. అయినా సరే ఏపీ ప్రజలు ఆశ కోల్పోకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ లో హామీలకు తగ్గట్టుగా ఏపీకి పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తూ అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అధికారపక్షం స్పందించింది. టీడీపీ నేతలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తంచేస్తున్నారు. ఎంపీలు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. చాలా సార్లు తాము కేంద్ర మంత్రులతో భేటీ అయ్యామని,
ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీకి వచ్చారని అయినప్పటికీ కేంద్రం రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. లోటు బడ్జెట్ తో రాష్ట్ర పాలనను ప్రారంభించామని, దేశంలో ఏపీ తప్ప ఏ రాష్ట్రమూ లోటు బడ్జెట్ లో లేదని, అలాంటప్పుడు తమిళనాడు,కర్నాటకకు ఇచ్చినట్టుగా ఏపీకి నిధులిస్తామంటే ఎలా కుదురుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.తాము రాష్ట్రానికి కావాల్సిన నిధులను అడిగింది ఒక లెక్కలో ఉంటే వారు ఇచ్చేది మరో లెక్కలో ఉందని, జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని పూర్తిచేయండని కూడా తామే కేంద్రప్రభుత్వాన్ని అడుక్కోవలసి వస్తోందని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని, అవసరమైతే రాజీనామా చేయమన్నా చేస్తామని తెలిపారు. పొమ్మన లేక పొగపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని టీడీపీ సీనియర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్ సాక్షిగానే కాకుండా..తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్రం న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం నామమాత్రంగా సాయంచేసిందని, వేల లక్షల కోట్లు సాయం చేస్తేనే నిజంగా సాయం చేసినట్టని జేసీ వ్యాఖ్యానించారు. విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా…నిధులు ఇవ్వలేదని, ఓర్పు, సహనానికి ఓ హద్దు ఉంటుందని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టే నాలుగేళ్లగా సహనంతో ఉన్నామన్నారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం అర్ధంచేసుకోవాలని కోరారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదని చెప్పారు. . బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులతో, ఎంపీలతో విడివిడిగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలంతా కేంద్రప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తుండడంతో తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చించాలని నిర్ణయించారు.