ఏపీ ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ వరుసగా మూడోరోజూ తెలుగు ఎంపీలు పార్లమెంట్ ఉభయసభలనూ స్తంభింపచేశారు. దీంతో లోక్ సభ మొదలైన నిమిషంలోపు, రాజ్యసభ మూడునిమిషాల్లోపు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభలు ప్రారంభం కాగానే… ప్రత్యేక హోదా కోసం టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రెండు సభల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీల ఎంపీలు కూడా తమ తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేస్తుండడంతో సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో సభలను ఆర్డర్ లోకి తెచ్చేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ముఖ్యమైన విషయాలు చర్చించాల్సిఉందని, సభలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని పలుమార్లు వారు సభ్యులను కోరారు. అయినా సభ్యులు శాంతించలేదు. దీంతో ఉభయసభలూ వాయిదాపడ్డాయి. అటు రోజుకో వింత పద్ధతిలో నిరసన తెలపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ కావడి మోస్తూ పార్లమెంట్ కు వచ్చారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని చెప్పిన ప్రధాని ముంతడు నీటిని, మట్టిని నోట్లో కొట్టిపోయారని ఆరోపిస్తూ… నీరు, మట్టితో నిండిన కావడిని శివప్రసాద్ మోసుకొచ్చారు. మోడీ ఇచ్చిన నీటిని, మట్టిని ఆయనకే పంపిస్తామని, వీటిని స్పీకర్ కు ఇచ్చి… ఆమె ద్వారా ప్రధానికి పంపించాలని కోరుతామని శివప్రసాద్ తెలిపారు.