దర్శకుడిగా మురుగదాస్ తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పై స్థాయి లోనే ఉన్నారు. తమిళంలో శంకర్ తరువాత గొప్ప దర్శకుడుగా పేరు ఉన్నది మురుగదాస్ కి మాత్రమే. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో స్పైడర్, హిందీ లో తీసిన అకీరా మాత్రమే ప్లాఫ్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ , స్టాలిన్ సినిమాల మాతృకలు కూడా మురుగదాస్ డైరెక్ట్ చేసినవే. అలాంటి మురుగదాస్ ఆయన తీసిన కత్తి సినిమా నుండి కాపీ దర్శకుడని, కథలు దొంగిలిస్తాడనే అపవాదులు మూటగట్టుకుంటున్నాడు. ఆయన తీసిన కత్తి సినిమా కథ తనదే అని, ఒకసారి మురుగదాస్ కి కథ వినిపిస్తే, నా కథని నాకు చెప్పకుండా దొంగిలించాడని గోపి నైనార్ అనే రచయిత ఫిర్యాదు చేశాడు. కత్తి సినిమా విడుదల సమయంలో వారిద్దరి మధ్య రాజీ కుదిరిందిలెండి. ఆ తరువాత ఆ రచయిత గోపి నైనార్ హీరోయిన్ నయనతార తో కర్తవ్యం సినిమా తీసి, మంచి విజయం సాధించాడు. ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా ఆ కత్తి సినిమా కథ ఈ గోపి నైనార్ దే అయివుంటుందని అనుకునేంత బాగా ఆ సినిమాని గోపి నైనార్ రూపొందించాడు.
సరే, ఇంతటితో మురుగదాస్ మీద ఉన్న కాపీ దర్శకుడు అనే మరక పోయినట్టే అని అతని అభిమానులు అందరూ అనుకుంటున్న సమయంలో, తమిళ హీరో విజయ్ తో ఆయన రూపొందించిన సర్కార్ సినిమా మీద మళ్ళీ ఈ కాపీ నిందలు మొదలయ్యాయి. వరుణ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సర్కార్ సినిమ కథ తనదే అని, ఈ కథని తాను రిజిస్టర్ కూడా చేయించానని, అలాంటిది నాకు ఎటువంటి వివరణ ఇయ్యకుండానే తన కథని ఎలా దొంగిలిస్తాడని రచయిత సంఘం కి ఫిర్యాదు చేశాడు. ఈ కథ కాపీ కాదని, నేను రాసిన సొంత కథ అని మురుగదాస్ చెప్పుకొస్తున్నా , ఆ రెండు కథలని పరిశీలించిన రచయితల సంఘం సర్కార్ కథ కాపీ అని తేల్చేశారు. ఈ విషయంలో మరింత దూరం వెళ్తే, సర్కార్ విడుదలకి ఇబ్బందులు ఎదురవ్వొచ్చనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర నిర్మాతలు ఆ రచయితతో రాజీకి వచ్చి, 30 లక్షల నగదు, టైటిల్స్ లో పేరు వేస్తామని చెప్పి, మురుగదాస్ నుండి వచ్చిన తలనొప్పిని వదిలించుకున్నారు.
తెలుగులో ఇలాంటివి ఎక్కువగా వినపడకపోయినా, కాపీ మాంత్రికుడు అదేలేండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పైన ఇలాంటి కాపీ నిందలు షరామామూలే. త్రివిక్రమ్ రచయితగా చేసిన చిరునవ్వుతో సినిమా నుండి ఇలాంటి కాపీ ఆరోపణలు వినపడుతున్నా , జులాయి లో ఏకంగా హాలీవుడ్ సూపర్ హిట్ బ్యాట్ మాన్ నుండి బ్యాంక్ రాబరీ సీన్ ని మక్కీకి మక్కీ దించేసాక, అ…ఆ సినిమా కథని కూడా యద్దనపూడి సులోచనారాణి మీనా నవల నుండి దొంగిలించాక, త్రివిక్రమ్ కి కాపీ మాంత్రికుడు అనే బిరుదు స్థిరపడిపోయింది. ఈ కాపీ మరకలు ఆయన ఇటీవలే తీసిన అరవింద సమేత సినిమా విషయంలో కూడా త్రివిక్రంకి అంటాయి. అయినా, ఈ దర్శకులు అందరూ కాస్త గొప్ప పేరు రాగానే ఇతరుల కథలు దొంగిలించే కన్నా, వాళ్ళకి కాస్త డబ్బు, పేరు ఇచ్చి వాళ్ళ కెరీర్ కి కాస్త చేయూత ని ఇవ్వొచ్చు కదా.