నటీనటులు : కల్యాణ్‌రామ్, తమన్నా, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి తదితరులు
సినిమాటోగ్రఫి : పీసీ శ్రీరామ్
మ్యూజిక్ : శరత్
దర్శకత్వం : జయేంద్ర
నిర్మాత : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి
సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు
ఇప్పటివరకూ మాస్ కమర్షియల్ సినిమాలు చేసిన కల్యాణ్‌రామ్ ఇమేజ్ ఛేంజోవర్ కోసం చేసిన సినిమా ‘నా నువ్వే’. కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తొలిసారిగా తన ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తి క్లాస్ మూవీగా తెరకెక్కిన నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో ఆయన పక్కన తమన్నా కథానాయిక. లవ్‌కి లాజిక్ ఏముంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాలో లవ్ మేజిక్ వర్కవుట్ అయ్యిందా? లేదా? చదవండి.
కథ
డెస్టినీని నమ్మే అమ్మాయి… నమ్మని అబ్బాయిల ప్రేమకథ నా నువ్వే. ప్రేమ, విధి అనే రెండు అంశాలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఇది. ఇందులో ప్రేమికగా నటించిన తమన్నా… డెస్టినీ నమ్మి ప్రేమికుడు కల్యాణ్ రామ్ వెంటపడుతుంది. డెస్టినీని నమ్మని కల్యాణ్ ఆమె ప్రేమకు పెట్టే పరీక్షే సినిమా. కథ గురించి చెప్పాలంటే ఇంతకంటే ఏం లేదు. ప్రేమకథలు ఒకేలా ఉన్నా ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్లనే సగం ప్రేమకథలు విజయవంతం అవుతుంటాయి. వరుణ్ (కల్యాణ్ రామ్) పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. మీరా (తమన్నా) డెస్టినీని విపరీతంగా నమ్మె అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్ లో వరుణ్ ఫొటో చూసి ఇంప్రెస్ అవుతుంది.
ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి (తనికెళ్ల భరణి) వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు చివరకు ఎలా కలిశారు..? అసలెందుకు దూరమయ్యారు అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్ లో కనిపించిన కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్ లుక్ లో మెప్పించాడు. కల్యాణ్‌రామ్ మేకోవర్ బాగుంది. కొత్త లుక్‌లో అందంగా వున్నారు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. మీరా పాత్రలో తమన్నా తెరపై కనిపిస్తున్నంత సేపూ ప్రేక్షకులు చూపు తిప్పుకోవడం కష్టమే. అంత అందంగా ఉందీ సినిమాలో. అంత అందంగా నటించింది. పాటల్లో అయితే అందాల ప్రదర్శనతోనూ రెచ్చిపోయింది. అయితే… కథకు కావలసిన రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో మాత్రం తమన్నా కాస్త హోంవర్క్ చేయాల్సింది. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి, ప్రవీణ్ తదితరులవి రొటీన్ పాత్రలే. జాతకాల పిచ్చి వున్న పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ‘వెంకీ’లో రవితేజ పాత్రను గుర్తుకు తెస్తుంది. కానీ కామెడీ ఎక్కడా పండలేదు.
జయేంద్ర అనుకున్న స్థాయిలో సినిమా తీయలేకపోయాడు. డెస్టినీ చుట్టూ రాసుకున్న కథలో ఎమోషన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. విడిపోయిన హీరోయిన్లు ఎలా కలుస్తారన్న క్యూరియాసిటీ కలిగించినా… ప్రేక్షకుడు కథలో లీనమయ్యే స్థాయి ఎమోషనల్ సీన్స్ లేకపోవటంతో సినిమా సోసోగా సాగుతుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రియదర్శి లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. శరత్ సంగీతమందించిన పాటలు ఓకె అనిపించాయి. నేపథ్య సంగీతం బాగుంది. యాడ్ ఫిలిం మేకర్ అయిన జయేంద్ర పాటలను యాడ్ ఫిలింస్ లా గ్రాఫిక్స్ నేపథ్యంలో ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది అని చెప్పాలి. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఉన్నా… ఆయన మ్యాజిక్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా మెయిన్ పాయింట్‌ను సాగదీసిన భావన కలుగుతుంది. పూర్తి క్లాస్ సినిమా కావటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.