కూకట్ పల్లి మినీ ఆంధ్ర ప్రదేశ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి అక్కర్లేదు. టీడీపీకి అత్యంత బలము బలగము ఉన్న ప్రాంతం కూడా అదే . తాజా ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సీటును హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి కట్టబెట్టారు. ఆమె కూకట్ పల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా టీడీపీ నాయకులు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో నామినేషన్ కూడా వేసేశారు. అయితే నందమూరి సుహాసిని అభ్యర్థిత్వంపై నియోజకవర్గం నేతలు – ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక నందమూరి సుహాసిని ప్రచార పర్వంలో వెనకపడి ఉన్నారు. ఇప్పటికే టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణరావు ఎప్పుడో ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లారు. అంతేకాకుండా గడిచిన నాలుగున్నరేళ్లుగా మాధవరం కూకట్ పల్లి ప్రజలతో కలిసిపోయారు స్థానిక ఓటర్లు – ప్రజల సమస్యల గురించి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. 2014లో టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నుంచి గెలిచిన మాధవరం అనంతరం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లోకి దూకినప్పటికి కూకట్ పల్లి ప్రజలు – నాయకుల నుంచి ఈయనపై వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదు. కానీ నందమూరి సుహాసిని కూకట్ పల్లి ప్రజలకు పూర్తిగా కొత్తవారు. పైగా స్థానికురాలు కూడా కాదు స్థానిక సమస్యలపై కూడా ఆమెకు పెద్దగా అవగాహన లేదు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆమె నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో కూడా తిరిగింది లేదు. సుహాసిని ప్రజల్లోకి ఎంత వేగంగా వెళ్లినా మాధవరం స్థాయిలో ప్రజలకు చేరువ కావడం కష్టమైన పనే అంటున్నారు విశ్లేషకులు సుహాసిని ఎంత వేగంగా స్పందించి ముందడుగు వేసినా ఈ ఎన్నికల ప్రచారంలో మాధవరంను అందుకోవడం కష్టమేనని నియోజకవర్గ నేతలు కూడా చెబుతున్నారు. సుహాసిని ఎమ్మెల్యేగా గెలిచినా స్థానికంగా ఉండరనే ప్రచారం కూకట్ పల్లి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. స్థానికులతో సత్సంబంధాలున్న వారిని గెలిపిస్తే తమకు అందుబాటులో ఉంటారు కదా అని కూకట్ పల్లి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవన్నీ ప్రజల మనస్సులో తుడిచి పారేయడానికి కూకట్ పల్లికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ తన గెలుపు కోసం పని చెయ్యాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు కూటమి శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె అడుగుతున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో వరుసగా భేటీలు నిర్వహించిన ఆమె ప్రచార వ్యూహం పై ప్రత్యర్ధిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో నందమూరి సుహాసిని త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు చేరువయ్యేందుకు గాను పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సుహాసిని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి మరిన్ని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానన్నారు సుహాసిని. కొంతమంది నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాళ్లకు తాను ఇక్కడే పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నానని సుహాసిని సమాధానమిచ్చారు. కొంతమందికి ఈ విషయం తెలియక తనను నాన్ లోకల్ అంటే సరిపోతుందా అని కౌంటర్ ఇచ్చారు . తన కోసం కుటుంబ సభ్యులందరూ ప్రచారం నిర్వహిస్తారని చెప్పిన సుహాసిని, కూకట్ పల్లిలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సినిమాల షెడ్యూల్ చూసుకుని బాలకృష్ణతోపాటు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని ఆమె క్లారిటీ ఇచ్చారు.