సుహాసినికి కలిసొచ్చిన అనుకోని అదృష్టం…!

Nandamuri Suhasini To Join TRS Party

దివంగత నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే కీలకమైన స్థానం కావడంతో పాటు, ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో టీడీపీ ఈ స్థానంపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే నందమూరి తారక రామారావు కుటంబానికి ఈ టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఇది ఆ పార్టీ సిట్టింగ్ స్థానమే కాకపోతే అక్కడి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవరంకు ఇక్కడ 43 వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. దీనికి తోడు సుహాసిని అభ్యర్థి కావడంతో ఈ సారీ ఇక్కడ విజయం సాధించవచ్చని ఆ పార్టీ మద్దతుదారులు అనుకుంటున్నారు.

Nandamuri-Suhasini-balakris

కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుహాసిని విజయం అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె రాజకీయాలకు కొత్త కావడం దీనికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. అయితే, తాజాగా ఆ నియోజకవర్గంలో జరిగిన ఓ పరిణామం సుహాసినికి అనుకూలంగా మారబోతుందనే టాక్ వినిపిస్తోంది. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు, శైలేశ్ కుమార్ తమ అనుచరవర్గంతో పాటు సైకిల్ ఎక్కేశారు. వీరి ఎంట్రీతో నందమూరి సుహాసిని విజయావకాశాలు మెరుగుపడినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు లోకల్ నేతల అండదండలు మెండుగా ఉండేవి.

Nandamuri-Suhasini

ఇప్పుడు వీరి రాజీనామాతో ఆయనకు కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉండడంతో పాటు, టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే మరో టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన కూడా మహాకూటమి ధర్మానికి కట్టుబడి సుహాసినికి మద్దతు ఇస్తున్నారు. వీళ్లందరి వల్ల టీడీపీ మరింత బలపడబోతుందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు సుహాసిని తరపున ఆమె బాబాయి నందమూరి బాలకృష్ణ ప్రచారం చేయనుండడంతో పాటు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆమెకు రోజురోజుకీ విజయావకాశాలు పెరుగుతున్నాయ్.