Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా సంచలన పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి ఊహించని మద్దతు లభించింది. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆమెకు బాసటగా నిలిచింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన శ్రీరెడ్డిపై మా నిషేధం విధించడాన్ని మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలింగించడమే అని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర సమాచార, ప్రసారశాఖలకు నోటీసులు జారీచేసింది. నాలుగువారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఇంతవరకు విచారణ జరపకపోగా… ఆమెపైనే కేసు పెట్టడమేమిటని కమిషన్ ప్రశ్నించింది. హీరోలు, దర్శకనిర్మాతలపై వరుస ఆరోపణలు చేస్తూ… నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి ఇప్పటిదాకా మానవ హక్కుల కమిషన్ ను మాత్రం ఆశ్రయించలేదు. అయినప్పటికీ, కమిషన్ ఆమె కేసును సుమోటాగా స్వీకరించి నోటీసులు జారీచేసింది.
నిజానికి కాస్టింగ్ కౌచ్ పై యూ ట్యూబ్ చానళ్లకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం… ఫిలింనగర్ లో ఆమె చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనతో అసలైన మలుపు తిరిగింది. అప్పటిదాకా ప్రాంతీయంగా మాత్రమే ఆమె వార్తల్లోకెక్కగా ఆ నిరసన తర్వాత ఆమె జాతీయమీడియా దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రదర్శనను అనేక ఇంగ్లీష్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ ఎవరో తెలియనివారికి కూడా శ్రీరెడ్డి తెలుసు అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శ్రీరెడ్డి అంశంపై స్పందించారు.
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు సంచలన వ్యాఖ్యలుచేసిన కంగనా రనౌత్ శ్రీరెడ్డికి మద్దతు పలికింది… కానీ ఆమె పోరాడే విధానాన్ని మాత్రం మార్చుకోవాలని సూచించింది. ఆ ప్రదర్శన తర్వాత ఒకప్పుడు శ్రీరెడ్డిని వ్యతిరేకించిన వారి నుంచి కూడా ఆమెకు సానుభూతి లభించింది… ఇప్పుడు జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా శ్రీరెడ్డికి మద్దతుగా నిలవడం… ఆమెకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.