Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాఫ్రికాలో భారత్ తొలిసారి వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడంలో రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడని చెప్పవచ్చు. నాలుగో వన్టేలో ఓటమి తర్వాత జరిగిన ఐదో వన్డేలో రోహిత్ సెంచరీ వల్లే భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోగలిగింది. అయినా సరే రోహిత్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రోహిత్ బ్యాటింగ్ చేసే సమయంలో అవతలి ఎండ్ లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజంక్యా రహానే లు ఇద్దరూ సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యారు. దీనికి రోహిత్ తప్పిదాలే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.
మోర్కెల్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడిన రోహిత్ శర్మ… సింగిల్ తీద్దామనుకున్నాడు. కొంచెం ముందుకెళ్లాడు. అయితే వెంటనే పరుగురాదని భావించాడేమో… వద్దని చెప్పి ఆగిపోయాడు. కానీ అప్పటికే కోహ్లీ చాలా దూరం వచ్చేశాడు. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ… డుమిని అండర్ ఆర్మ్ త్రో వికెట్లను తాకడంతో కోహ్లీ రనౌట్ గా వెనుతిరగాల్సివచ్చింది. కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రహానే కూడా కాసేపటికి దాదాపుగా ఇదేవిధంగా రనౌటయ్యాడు. ఇదే నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. రెండు రనౌట్లకు కారణమైన రోహిత్ యోయో టెస్టు ఎలా పాసయ్యాడో అర్ధం కావడం లేదని, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంకా ఎంతమందిని రనౌట్ చేస్తాడో అని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు నెటిజన్లు రోహిత్ ఓ స్వార్థపరుడని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించినప్పటికీ..రోహిత్ కు ఆ సంతోషం మిగలనివ్వడం లేదు నెటిజన్లు.