Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉగ్రదాడితో అమెరికా ఉలిక్కిపడింది. న్యూయార్క్ లోని డబ్ల్యూటీసీ వద్ద ఓ ఉగ్రవాది ట్రక్కుతో దాడికి పాల్పడ్డాడు. ట్రక్కును డ్రైవ్ చేస్తున్న ఉగ్రవాది.. దాన్ని ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. ఆ మార్గంలో ట్రక్కుతో వేగంగా దూసుకెళ్తూ కనిపించినవారినల్లా ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. తరువాత ట్రక్కులోనించి దిగి గన్ను పట్టుకుని అక్కడే ఉన్న చిన్నారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఉగ్రదాడిలో 8 మంది మృతిచెందగా..11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ట్రక్కు డ్రైవర్ పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా వాసులు కాగా..ఒకరు బెల్జియం వాసి. అర్జెంటీనా వాసులు ఐదుగరు తమ గ్రాడ్యుయేషన్ వేడుకలు జరుపుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు. వారంతా స్నేహితులు. దాడికి పాల్పడిన నిందితుణ్ని ఉజ్బెకిస్తాన్ కు చెందిన సైఫుల్లా సైపోవ్ గా గుర్తించారు.
పోలీసుల కాల్పుల్లో అతను గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సైఫుల్లాకు శస్త్ర చికిత్స అవవసరం లేదని వైద్యులు తెలిపారు. సైఫుల్లా ఉగ్రదాడికి ఉపయోగించిన ట్రక్కులో ఉగ్రవాదసంస్థ ఐసిస్ కు సంబంధించిన లేఖను గుర్తించారు. ట్రక్కుతో సైక్లిస్టులను, పాదాచారులను ఢీకొట్టే సమయంలో సైఫుల్లా అల్లాహూ అక్బర్ అని కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాడి జరిపిన తరువాత సుమారు 20 సెకన్ల పాటు సైఫుల్లా ఘటనాస్థలిలోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడి దగ్గర బొమ్మతుపాకీ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి పెయింట్ బాల్ గన్, పెల్లెట్ గన్ స్వాధీనం చేసుకున్నారు. సైఫుల్లా అమెరికాలో ఉబెర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2010లో ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ నుంచి అమెరికాలోని ఓహియోకు వలస వచ్చాడు. తర్వాత అనేక ప్రాంతాలకు మారాడు. తొలిరోజుల్లో సైఫుల్లా ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో అతనికి ఇంగ్లీషులో మాట్లాడడం రాదు. అమెరికాలో ఇంగ్లీష్ తప్పనిసరి కావడంతో…సైఫుల్లా ఆ భాషను బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు ఫోర్డ్ మేయర్స్ కు వెళ్లిన సైఫుల్లా..అక్కడ ఉజ్జెకిస్తాన్ కే చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నాడు. కొన్నాళ్లు ట్రక్ డ్రైవర్ గా పనిచేశాడు. తర్వాత న్యూజెర్సీలోని పీటర్సన్ కు వలసవెళ్లి అక్కడ ఉబెర్ సంస్థలో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని తంపాలో నివసిస్తున్నాడు. సైఫుల్లా ఉగ్రదాడికి పాల్పడడాన్ని అతనితో కలిసి ఒకే గదిలో ఉన్న మరో ఉజ్బెకిస్తాన్ పౌరుడు బెఖ్జోద్ నమ్మలేకపోతున్నాడు.
అమెరికాకు వచ్చిన కొత్తల్లో సైపో తన దగ్గరే ఉన్నాడని, అమెరికా అంటే అతడికి చాలా ఇష్టమని, ఇక్కడ ఉండడాన్ని అదృష్టంగా భావించేవాడని బెఖ్జోద్ తెలిపాడు. తన వద్ద ఉండే సమయంలో సైపో ప్రవర్తన ఎప్పుడూ అనుమానాస్పదంగా లేదని, అతను ఉగ్రవాదన్న సందేహమే తనకు రాలేదని చెప్పాడు. సైపో ఉగ్రవాద నేపథ్యం ఆయన డ్రైవర్ గా పనిచేసే ఉబెర్ సంస్థకు కూడా తెలియదు. ఉద్యోగంలో చేర్చుకునేముందు సైఫుల్లా నేపథ్యాన్ని ఉబెర్ పూర్తిగా పరిశీలించిందని, ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఎఫ్ బీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఏడేళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చిన సైఫుల్లా గ్రీన్ కార్డు కూడా సాధించాడని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చెప్పారు. ఉగ్రదాడికి ఉపయోగించిన ట్రక్కును సైఫుల్లా న్యూజెర్సీలో మంగళవారం అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడి ఉగ్రవాదుల పనేనని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లసియో తెలిపారు.
ఉగ్రదాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. దేవుడు, ఈ దేశం మీ వెంటే ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రక్కు దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇస్లామిక్ స్టేట్ అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించరాదని ట్రంప్ ఆదేశించారు. ప్రపంచదేశాలన్నీ ఈ దాడిని ఖండించాయి.
ఉగ్రదాడిపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ట్విట్టర్ లో స్పందించారు. తాను ఉండే అపార్ట్ మెంట్ కు కేవలం ఐదు బ్లాకుల దూరంలో ఈ దాడి జరిగిందని, తాను షూటింగ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి సైరన్ల మోత మార్మోగిందని తెలిపారు. ఆ చప్పుడు ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితిని తెలియజేస్తోందని ప్రియాంక ట్వీట్ చేశారు. ఉగ్రవాదులు ట్రక్ ఉపయోగించి దాడులకు పాల్పడడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. యూరప్ దేశాల్లోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. నిజానికి 911 దాడులు తర్వాత అమెరికా భద్రతను ముమ్మరం చేసింది. విదేశాలకు చెందిన పౌరులపై విస్తృత తనిఖీలు జరుపుతోంది. ప్రతి ముస్లిం ను అమెరికా పౌరులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. చివరికి వారి అనుమానమే నిజమయింది. అయితే ఎంత విస్తృత నిఘా సామర్థ్యం ఉన్నప్పటికీ ఏడేళ్ల క్రితం దేశంలోకి వచ్చి ఐసిస్ ఉగ్రవాదిగా మారిన సైఫుల్లాను గుర్తించలేకపోవడం గమనార్హం.