Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ ప్రసంగాన్ని అందరూ ప్రశంసిస్తోంటే… పాశ్చాత్య మీడియా మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇవాంకా హైదరాబాద్ లో చేసిన ప్రసంగంలో కొత్త అంశాలేమీ లేవని, గతంలో తాను చేసిన ప్రసంగాన్నే… మళ్లీ చదివారని ఎద్దేవా చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఇవాంకా హైదరాబాద్ ప్రసంగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనేక పత్రికలు ఇవాంకా ప్రసంగంపై రివ్యూలు రాస్తున్నాయి. గత నెల రెండో తేదీన టోక్యోలో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ లో చేసిన ప్రసంగాన్నే కాస్త అటూఇటుగా మార్చి ఇవాంకా హైదరాబాద్ లో చదివారని న్యూస్ వీక్ పత్రిక తెలిపింది. ఇవాంకా ట్రంప్ రీ సైకిల్స్ హర్ ఓన్ స్పీచ్ ఇన్ ఇండియా శీర్షికతో న్యూస్ వీక్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆమె ప్రసంగంలోని కొన్ని చిన్న చిన్న పదాలు తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అని విమర్శించింది. ఈ ముత్యాల నగరిలో గొప్ప నిధి మీరే లాంటి చిన్న చిన్న పదాలు మాత్రమే కొత్తగా వాడారని, మహిళలు పనిచేస్తే… దాని ప్రభావం ద్విగుణీకృతం అవుతుందని, పురుషుల కంటే మహిళలే ఎక్కువమందికి ఉపాధి ఇవ్వగలుగుతారని చేసిన వ్యాఖ్యలు టోక్యో ప్రసంగం నుంచి యథాతథంగా తీసుకున్నారని, మహిళలు వారి సంపాదనను తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా పెడతారన్న వాక్యాలు కూడా అక్కడివేనని వివరించింది. అయితే న్యూస్ వీక్ కథనంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాంకాకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖులు ప్రసంగించేటప్పుడు కొన్ని వాక్యాలు పునరావృతం కావడమనేది చాలా సహజమైన విషయమని, దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని సమర్థిస్తున్నారు.