Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగురాష్ట్రాలకు దక్కని పదవులు
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని మోడీ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరించారు. నలుగురు సీనియర్ మంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించిన ప్రధాని కొత్తగా తొమ్మిదిమందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. విస్తరణకు ముందు సహాయ మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలకు పునర్ వ్యవస్తీకరణలో క్యాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ లభించింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన శివప్రతాప్ శుక్లా, సత్యపాల్ సింగ్, బీహార్ కు చెందిన అశ్విన్ కుమార్ చౌబే, రాజ్ కుమార్ సింగ్, మధ్యప్రదేశ్ కు చెందిన వీరేంద్ర కుమార్, కర్నాటకు చెందిన అనంతకుమార్ హెగ్డే, హరదీప్ సింగ్ పూరి, రాజస్థాన్ కు చెందిన గజేంద్ర సింగ్ షెకావత్, కేరళకు చెందిన అల్ఫోన్స్ కన్నన్ థానం కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. రిటైర్డ్ అధికారులకు విస్తరణలో మోడీ పెద్దపీట వేశారు. హర్దీప్ సింగ్ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాగా, సత్యపాల్ సింగ్ ముంబై మాజీ పోలీసు కమిషనర్, అల్ఫోన్స్ కన్నన్ థానం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పునర్ వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్, బీహార్ కు రెండేసి మంత్రి పదవులు దక్కాయి.
ఉత్తరప్రదేశ్ కే చెందిన నఖ్వీకి క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ దక్కింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించటం, బీహార్ లోనూ ఇటీవలే జేడీయూ తో కలిసి అధికారం చేపట్టటంతో బీజేపీఆ రెండు రాష్ట్రాలకు విస్తరణలో ప్రాధాన్యం కల్పించింది. అయితే చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా జేడీయూకు, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకెకు పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కలేదు. ఆ రెండు పార్టీల్లో అంతర్గత సమస్యలు సర్దుబాటు కానందున మంత్రివర్గంలోకి తీసుకోవటానికి మోడీ సుముఖత చూపలేదు. ఇక తెలుగు రాష్ట్రాలకు విస్తరణలో మొండిచేయే మిగిలింది. ఏపీ నుంచి కొత్తగా ఎవరికీ పదవి దక్కలేదు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయతో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్టానం…ఆ స్థానంలో మరొకరికి పదవి కేటాయించలేదు.