ఏపీ, తెలంగాణలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత…!

NTPC Red Flags Payment Delays From AP Karnataka And Telangana

24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక‌ రాష్ట్రాలకు ఫిబ్రవరి 9 నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపేయాలని ఎన్టీపీసీ భావిస్తోంది. గడువు లోపు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఎన్‌టీపీసీ హెచ్చిరించింది. ఫిబ్రవరి 9ని తుదిగడువుగా నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ‘విద్యుత్‌ సరఫరా నియంత్రణ’ నోటీసులను ఎన్టీపీసీ ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. గత రెండు నెలల పైబడి బకాయిలు చెల్లించకపోవటం వల్లే వీటిని జారీ చేసినట్లు ఎన్టీపీసీ తెలిపింది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.7,859కోట్ల బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయని ఎన్టీపీసీ వెల్లడించింది. ఇందులో అగ్ర భాగం రూ. 4,890 కోట్లు బకాయిలు కేవలం ఈ మూడు రాష్ట్రాల నుంచే రావాల్సి ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ పోర్టల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు.. ఎన్టీపీసీకే కాకుండా ఇతర విద్యుత్ సరఫరా కంపెనీలకు ఉత్తరప్రదేశ్‌ రూ. 6,127 కోట్లు బకాయి పడింది. రాజస్థాన్‌ రూ.2404 కోట్లు, పంజాబ్‌ రూ.1,041 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.