ప్రీ క్లైమాక్స్ కి చేరుకున్న ఆపరేషన్ గరుడ…వారి భేటీలే కీలకం !

operation-garuda-came-to-pre-climax

‘ఆప‌రేష‌న్ గ‌రుడ‌’… ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల చర్చల్లో హాట్ టాపిక్ ఇది. ఆంధ్రాలో చంద్ర‌బాబు స‌ర్కారును నిర్వీర్యం చేయ‌డం కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒక మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌నీ, గ‌త కొన్ని నెల‌లుగా దాన్ని అమ‌లు చేస్తోంద‌నే క‌థ‌నాలు కొద్ది నెలలుగా గుప్పుమంటున్నాయి. రాజ‌కీయ అనిశ్చితి సృష్టించ‌మే ల‌క్ష్యంగా ఆంధ్రా విష‌యంలో కొన్ని నెల‌లుగా భాజ‌పా పక్షపాత వైఖ‌రి ప్రదర్శించి, ఏపీకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో, బ‌డ్జెట్ లో అర‌కొర కేటాయింపులు, విభ‌జ‌న హామీల‌పై మొండి వైఖ‌రీ ఇలా అంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రుగుతున్న కుట్ర అన్న‌ట్టుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ కుట్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌గ‌న్ ను కూడ భాజ‌పా భాగస్వామ్యం చేసిందన్న ఆరోప‌ణ‌లూ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వాదన తెలుగు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపబోతోంది అని తెలుస్తోంది.

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆంధ్రా తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఆయ‌నే ఎప్ప‌టికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌గ‌న్ లు కూడా న‌ర‌సింహ‌న్ తో ఈ మ‌ధ్య‌ బాగానే ట‌చ్ లో ఉంటున్నార‌నీ కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు న‌ర‌సింహ‌న్ ను వ్య‌తిరేకిస్తున్నా ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావ‌జాలం ఆయ‌న‌కి కొంత ఉంద‌నీ, అందుకే భాజ‌పా ఆయ‌న్ని కొన‌సాగిస్తోంద‌నే అభిప్రాయ‌మూ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఆధిప‌త్యం సాధించాల‌న్న ల‌క్ష్యంతో ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఆంధ్రాలో క‌ల‌క‌లం సృష్టించాల‌న్న‌ది భాజ‌పా ఎత్తుగ‌డగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈరోజు కూడా గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో తెలంగాణా లో సంచలనం కలిగించిన ఓటుకి నోటు కేసుతో పాటు ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కేంద్రానికి గవర్నర్ రిపోర్ట్ అందచేసారు అని తెలుస్తోంది.

పైకి ఫెడరల్ ఫ్రంట్ అంటూ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా బీజేపీకి ఫేవర్ గానే ఉన్నారని అన్ని పరిణామాల బట్టి అర్ధం అవుతోంది. చంద్రబాబును వీలైనంతగా ఇబ్బందుల్లో కి నెట్టి.. ఏపీ నుంచి బయటకు రాకుండా చేయడంతో పాటు వీలైతే ఆయన మీద కేసులు వేసి నిర్భందిస్తే తమకు రాజకీయంగా ఎంతో లాభం కలుగుతుందని.. బీజేపీ భావిస్తోంది. కేసీఆర్ కు కావాల్సింది కూడా అదే ఎందుకంటే ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే.. తెలంగాణలో కాంగ్రెస్‌ మునుగుతుందని ఆంధ్రా పార్టీతో చేతులు కలిపారన్న నిందను కాంగ్రెస్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అది కేసీఅర్ కే ప్లస్ అవుతోంది.

2014 ఫలితాలు రాక ముందు కేసీఆర్ ఇక్కడ నేను అక్కడ జగన్ ముఖ్యమంత్రులం అవుతాం అని చెప్పారు, కానీ వైకాపాను దెబ్బ కొడుతూ తెలుగుదేశం అధికారం పొందింది. ఆయనకీ అక్కడ జగన్ అయితేనే పాలన సజావుగా సాగుతుంది, తెలంగాణాకి ఇబ్బందులు ఉండవు, అందుకే చంద్రబాబు దెబ్బ తినాలి. ఇదే ఎజెండా తో ముందుకుపోతున్నారు అనే అనుమానాలని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం లో మరింత ముందుకు ఆపరేషన్ గరుడ ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి కేంద్ర పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అప్పట్లో శంకర్రావుతో జగన్ మీద కాంగ్రెస్ పిటిషన్ వేయించి అక్రమాస్తుల కేసు వెలుగులోకి తెచ్చినట్టు ఇప్పుడు బీజేపీ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతుందా ? అనే అనుమానాలు కూడా వ్యాతం చేస్తున్నారు. ఈరోజు కూడా ప్రధాని మోడీ తో భేటీ అయిన కేసీఆర్ పైకి అభివృద్ధి పనుల కోసమే అని చేబుతున్నా ఆయన ఓటుకి నోటుపైనే మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ పరిణామాలతో ఆపరేష్ గరుడ ప్రీ క్లైమాక్స్ కి చేరినట్టు అర్ధం అవుతోంది.