Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : గోపీచంద్ , అను ఇమ్మనుఎల్, రాశి ఖన్నా , సాక్షి చౌదరి , జగపతిబాబు
నిర్మాతలు: AM రత్నం , ఐశ్వర్య
దర్శకత్వం : జ్యోతికృష్ణ
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
ఎడిటర్ : ఎస్. బి ఉద్ధవ్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
“ ఆక్సిజన్ “ …ఓ తెలుగు సినిమాకు ఇలాంటి పేరు అసలు ఊహించలేం. అయినా అదే టైటిల్ తో సక్సెస్ అనే ప్రాణవాయువు కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ , దర్శకుడు జ్యోతి కృష్ణ కలిసి చేసిన సినిమా ఇది. ఇక స్క్రీన్ ప్లే రాసింది భారీ సినిమాల నిర్మాత, దర్శకుడు జ్యోతి కృష్ణ తండ్రి ఏ.ఎం . రత్నం. ఈ ముగ్గురి కాంబినేషన్లో శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ పతాకం మీద నిర్మాత ఐశ్వర్య చేసిన సినిమా “ఆక్సిజన్ “. సినిమా ట్రైలర్ చూస్తే రొటీన్ కమర్షియల్ సినిమా అనిపిస్తోంది. టైటిల్ చూస్తే డిఫరెంట్ గా వుంది. దీంతో ఎక్కడో తెలియని ఆసక్తి. ప్రేక్షకుల ఆ ఆసక్తికి తగ్గట్టు “ ఆక్సిజన్ “ మూవీ వుందో, లేదో చూద్దాం.
కథ…
అందమైన పల్లెటూరులో ఓ యువకుడు. అతనికి చుట్టూ మంచి కుటుంబం. ప్రేమించే అమ్మాయి. తలలో నాలుకలాంటి స్నేహితులు. అబ్బా జీవితం అంటే ఇలా ఉండాలి అనుకునే లాంటి లైఫ్. హాయిగా సాగిపోతున్న అతని జీవితంలో ఊహించని కుదుపు. తెలియని శత్రువు దాడిలో అయినవాళ్లు లేకుండా పోతారు. ఆ దుర్మార్గానికి ఒడిగట్టింది ఎవరో తెలుసుకునేందుకు అతని ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఊహించని మలుపులు ఎదురు అవుతాయి. చివరకు శత్రువు ఎవరో ఆ యువకుడికి తెలుస్తుందా ?.ఇలాంటి రివెంజ్ బేస్డ్ కధకి ఆక్సిజన్ అని పేరు ఎందుకు పెట్టారు అన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ…
ఏ సినిమా అయినా ప్రేక్షకులకి కనెక్ట్ కావాలంటే కొత్త విషయం అయినా చెప్పాలి. లేదా బాగా తెలిసిన విషయాన్ని కొత్త కోణంలో అయినా చెప్పాలి. ఇక్కడ ఆక్సిజన్ లో జ్యోతి కృష్ణ ఆ రెండు సక్సెస్ ఫుల్ ఫార్ములాలు కలిపి తీసాడు. రొటీన్ రివెంజ్ స్టోరీ లో ఊహకు అందని విషయాలు పొందుపరిచాడు. అందుకే ఆక్సిజన్ ఇంటర్వెల్ బాంగ్ దాకా ప్రేక్షకుడు సీట్ లో వెనక్కి కూర్చుని రిలాక్స్డ్ గా ఓ రొటీన్ వినోదంతో కూడిన సినిమాని చూసినట్టు చూస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఊహించని కుదుపు. సీట్ లో నుంచి ముందుకు వచ్చి కూర్చుంటాడు. ఇక అక్కడ నుంచి తీసుకునే మలుపులు ప్రేక్షకుడిని కుదురుగా ఉండనివ్వవు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ కథ ఎంత రొటీన్ అనిపించిందో ఏ .ఎం . రత్నం స్క్రీన్ ప్లే అంత కొత్తగా ఉంటుంది. మొత్తానికి సినిమా అయిపోయాక ఇలాంటి సినిమాని ఇలాగా తీయొచ్చా అన్న ఆశ్చర్యంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.
17 ఏళ్ల వయసులోనే చిరంజీవి స్నేహం కోసం సినిమా తమిళ్ ఒరిజినల్ కి కధా సహకారం అందించిన జ్యోతికృష్ణ ఆ తర్వాత దర్శకుడుగా మారి తీసిన రెండు ,మూడు సినిమాలు విఫలం అయ్యాయి. అందుకే ఈసారి పూర్తి పట్టుతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో తగిన టైం తీసుకుని చేసిన సినిమా “ఆక్సిజన్”. ఈ సినిమా నిజంగా అతనికి దర్శకుడుగా ప్రాణవాయువు అవుతుంది అనడంలో సందేహం లేదు.
హీరో గోపీచంద్ ఎంతో నమ్మకంతో చేసిన ఆక్సిజన్ ఆయన ఎదురు చూస్తున్న సక్సెస్ అందించినట్టే . గోపి కొత్తగా చేసాడు అని చెప్పలేకపోయినా చాలా బాగా చేసాడు అని చెప్పుకునే సందర్భాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. జగపతి బాబు, రాశి ఖన్నా కూడా బాగా చేశారు. అను ఇమ్మానుయేల్, వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, అభిమన్యు సింగ్ ఈ సినిమాకు ప్లస్. ఇక సాంకేతిక విభాగానికి వచ్చేసరికి యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్ అని చెప్పుకోవాలి. ఛోటా కె . నాయుడు ఫోటోగ్రఫీ తో పాటు ఏ. ఏం. రత్నం స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు బలం తెచ్చిపెట్టాయి.
ప్లస్ పాయింట్స్ …
స్క్రీన్ ప్లే
ట్విస్ట్స్
హీరో
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ …
రొటీన్ కథ
తెలుగు బులెట్ పంచ్ లైన్…”ఆక్సిజన్ “ సక్సెస్ కోసం అలమటిస్తున్న వాళ్లకు నిజంగా ప్రాణవాయువే.
తెలుగు బులెట్ రేటింగ్… 3 . 25 / 5 .