Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ పద్మావతి సినిమాకే తలమానికంగా భావిస్తున్న ఘూమర్ పాట విడుదలయింది. రాజ్ పుత్ వంశానికి చెందిన మహిళల సాంప్రదాయ నృత్యం ఘూమర్. రాజస్థాన్ లో వధువులు అత్తగారింట్లో అడుగుపెట్టేటప్పుడు ఈ నృత్యం చేస్తారు. గుండ్రంగా తిరుగుతూ చేసే ఈ నాట్యానికి రాజ్ పుత్ ల చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీంతో ఘూమర్ పాటను సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయనే ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. పద్మావతి గా నటిస్తున్న దీపికా పదుకునే కూడా పాటకోసం ఎంతో కష్టపడ్డారు.
గంగౌర్ ఘూమర్ డ్యాన్స్ అకాడమీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి. డి. తోమర్ పర్యవేక్షణలో కృతిమహేశ్ దీపికకు ఘూమర్ నృత్యంలో శిక్షణ ఇచ్చారు. దీపిక ఈ నృత్యరీతులను రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది. సినిమా చిత్రీకరణ ఈ పాటతోనే ప్రారంభమయింది. దాదాపు వంద మంది 40 రోజుల పాటు కష్టపడి నిర్మించిన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరిపారు. 20 కిలోల బరువున్న లెహెంగా వేసుకుని ఒంటినిండా ధగధగ మెరిసే ఆభరణాలతో దీపిక 60 సార్లకు పైగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేసిన తీరు అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. పాటలో దీపిక అచ్చం యువరాణిని తలపిస్తోంది. శ్రేయాఘోషల్ పాడిన ఘూమర్ సాంగ్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.