ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. సెమీస్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్‌పై నిన్న జరిగిన మ్యాచ్‌లో 300పైచిలుకు భారీ స్కోరుతో పాకిస్థాన్ గెలవాల్సి ఉండగా.. ఆ జట్టుకి అది సాధ్యం కాలేదు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ టీమ్‌ని 7 పరుగులకే ఆలౌట్ చేసింటే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కి చేరేది. కానీ.. 26 పరుగుల వరకూ కనీసం ఒక్క బంగ్లా వికెట్ కూడా పాక్ బౌలర్లు పడగొట్టలేకపోయారు. దీంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే పాకిస్థాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌లో రెండు జట్లకీ ఇదే ఆఖరి మ్యాచ్. ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు (14 పాయింట్లు), భారత్ (13), ఇంగ్లాండ్ (12) జట్లు సెమీస్‌కి అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్తు కోసం న్యూజిలాండ్ టీమ్ (11), పాకిస్థాన్ (9) రేసులో నిలిచాయి. కానీ.. పాక్ పేలవ ప్రదర్శనతో ఆ బెర్తుని న్యూజిలాండ్ ఖాయం చేసుకుంది. చివరి లీగ్ లో పాక్ 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యంలో బరిలో దిగన బంగ్లా జట్టు చివరికి 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.