ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రానికి సన్నద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిటాల శ్రీరామ్ కోసం హిందూపూర్ లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత స్వయంగా వెల్లడించారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం నిమ్మల కిష్టప్ప హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యంవహిస్తున్నారు. పరిటాల రవి కేవలం తెలుగుదేశం నాయకుడు మాత్రమే కాదు రాయలసీమలో అత్యంత ప్రముఖుడు. ఆయన కుటుంబానికి ఇప్పటికీ ఆ స్థాయి గౌరవం దక్కుతోంది అంటే పరిటాల రవి ముద్ర తెలుగు ప్రజలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఒకే కుటుంబంలో రెండు సీట్లు చంద్రబాబు ఇస్తారా లేదా అన్నది ఒక అనుమానం. కాకపోతే రాజకీయంగా పార్టీకి చాలా కీలకమైన కుటుంబం కావడంతో ప్రస్తుతానికి ఇంకా తేల్చకుండా డైలమాలో ఉంచారు.చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తామని చంద్రబాబు కోర్టులోకి బంతిని నెట్టేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు సునీతమ్మ. మరి కొడుకు కోసం తల్లి త్యాగం చేయాల్సి వస్తుందా? లేదా కొడుకు ఏదైనా రాజకీయ పదవితో సర్దుకోవాల్సి వస్తుందా అన్నది ఇంకా తేలాల్చి ఉంది. అయితే పెనుగొండ, అనంతపూర్, ధర్మవరం, కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒకచోటి నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ తొలుత భావించారు. అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయన ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది.