Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతా అనుకున్నట్టే అవుతోంది. లోక్ సభలో టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ పన్నిన వ్యూహం ప్రకారమే సభ నడుస్తోంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. అయితే రెండు సభల్లో వివిధ పక్షాలు వేర్వేరు డిమాండ్ లతో ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. మరీ ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం లోక్ సభలో ప్రస్తావనకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే సభ్యలు కావేరి బోర్డు ఏర్పాటుకి డిమాండ్ చేస్తూ వెల్ లోకి దూసుకొచ్చారు. తెరాస సభ్యులు రేజర్వేషన్ల అంశం మీద ఆందోళనకు దిగారు. దీంతో లోక్ సభ ఓ గంట పాటు వాయిదా పడింది. తిరిగి లోక్ సభ మొదలు అయ్యాక కూడా అవే పరిణామాలు రిపీట్ అయ్యాయి. ఆ సమయంలో లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలిచే పక్షాలు లేచి నుంచున్నప్పటికీ వెల్ లో గొడవ ఆగకపోవడంతో సభని రేపటికి వాయిదా వేశారు.
వెల్ లోకి వచ్చిన అన్నాడీఎంకే సభ్యుల వెనుక బీజేపీ హస్తం ఉందని అర్ధం అవుతూనే వుంది. లోక్ సభలో మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకుండా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అన్న సందేహం ముందుకు వస్తోంది. సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ చేసిన అన్యాయం గురించి దేశ ప్రజలందరికీ అర్ధం అవుతుందని ఆ పార్టీ భయపడుతోంది. అలా జరిగితే బీజేపీ కి దేశవ్యాప్తంగా వున్న విశ్వసనీయత పోతుందన్న భయం వారిది. ఒకటిరెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఈ ప్రభావం ఉంటుందని కూడా బీజేపీ ఆలోచన. అందుకే ప్రస్తుతానికి బీజేపీ తప్పించుకునే ధోరణిలోనే వ్యవహరిస్తోంది.