Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ అలా కాకుండా ఇలా ఉంటే బావుండేదని సామాన్య ప్రేక్షకులు అనుకోవడం సహజం. మనం చూసిన ఎన్నో సినిమాలను ఇలా విశ్లేషిస్తూ ఉంటాం కూడా. ఆ క్యారెక్టర్ ఇలా ఉండాలి.ఈ పాత్ర అలా ప్రవర్తించి ఉండే బాగుండేది వంటి వ్యాఖ్యానాలు సినిమా సంభాషణల్లో మిత్రుల మధ్య సరదాగా దొర్లిపోతుంటాయి. మనకే కాదు.నిత్యం సినిమాల్లో మునిగే తేలే వారికీ ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ జైలవకుశ సినిమా గురించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. జైలవకుశ చిత్రం చివర్లో జై క్యారెక్టర్ ను చనిపోయినట్టు చూపించకుండా ఉండే బాగుండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. క్లయిమాక్స్ ఇప్పుడున్న విధంగా కాకుండా..మరోలా చిత్రీకరిస్తే అద్భుతంగా ఉండేదని విశ్లేషించారు.
నేననేది అబద్ధం…మ..మ…మనం అనేదే నిజం. నాకోసం చచ్చిపోదామని కూడా మీరు అనుకున్నారని తెలిసిన తరువాత కూడా నేనెలా చనిపోతానురా అని జై తో చెప్పించి, ముగ్గురి అన్నదమ్ములపై ఫ్రీజ్ చేసి సినిమా ముగిస్తే మరింత అద్భుతంగా ఉండేదని పరుచూరి తన ఆలోచనను వివరించారు. ఇది తన రివ్యూ ఏమీ కాదని, తన మదిలో మెదిలిన ఊహ అని తెలిపారు. జైలవకుశలో ఎన్టీఆర్ నటనపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన ఎన్నటికీ గుర్తుండిపోతుందని, తారక్ పేరుకు మాత్రమే చిన్న రామయ్యని, నటనలో మాత్రం పెద్ద రామయ్యేనని ప్రశంసించారు. రివ్యూలపై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను పరుచూరి ప్రస్తావించారు. విమర్శకులకు ఈ చిత్రం ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని ఎన్టీఆర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.