ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో చేయీ చేయీ కలిపి తిరిగిన వారు కూడా ఇప్పుడు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. తెలుగు దేశం – జనసేన బీజేపీలు కలిసిపోయి జనాల్లోకి వెళ్లి గెలిచారు. కానీ ఇప్పుడు మారిన సమీకరణాలతో చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంతో సరికొత్త రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు వరుసగా విమర్శలు చేయడం కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కలిసున్నప్పుడు తరచు కలుసుకునే చంద్రబాబు పవన్ రాజకీయల కారణంగా ఎదురుపడలేదు. అలాంటిది ఇప్పుడు చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవనున్నారు. నేడు గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరుకానున్నారు.
ఈ ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే ఈ నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తి అయిన సంగతి తెలిసిందే. దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా, గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే కానుంది. వారితో పాటు దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా కార్యక్రమానికి హాజరు కానున్నారు. చంద్రబాబు పవన్ ఇన్ని రోజులు విమర్శలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎదురుపడినప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.