సమాజం లేదా అదృష్టం ఓ మనిషికి ఏ స్థాయి ఇచ్చినా అతని ఆలోచనలు మాత్రం తన పరిణితికి తగ్గట్టే ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తినా కూడా ఆయనలో ఇంకా ఆవేశం పాళ్ళు తగ్గలేదు. పాత ప్రేమలు మర్చిపోలేదు. అలాగే ఆయనకు ఒకప్పుడు గన్ అంటే మహా ఇష్టం అన్న విషయం బయటకు వచ్చింది. అది ఆయనే చెప్పుకున్నారు. ఆ తుపాకీ మీద ప్రేమ కోసమే ఒకప్పుడు విప్లవం లోకి కూడా వెళ్ళాలి అనుకున్నాడట పవన్. గన్ మీద ఇష్టం పెంచుకున్న పవన్ హీరో అయ్యాక నిజం తుపాకీ కొనుక్కున్నారు. అయితే కుటుంబానికి సంబంధించిన ఓ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఆయన నాటకీయంగా పోలీసులకు అప్పగించడం, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం అదంతా అప్పట్లో ఓ సంచలన సన్నివేశం.
ఇప్పుడు మళ్లీ విశాఖ లో ఓ బహిరంగ సభలో తుపాకీ మీద మోజు గురించి పవన్ చెప్పడంతో ఆయనకు విప్లవం మీద వున్న ఇష్టం కూడా బయటకు వచ్చింది. అయితే తుపాకీ అప్పగించినట్టు విప్లవం మీద ఆసక్తి వదులుకోడానికి మాత్రం పవన్ సిద్ధంగా లేనట్టుంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షాన్ని లొంగదీయడానికి ఎన్నో దారులు ఉంటాయి. నిరసన తెలిపే మార్గాలు ఎన్నో ఉంటాయి. అయితే పవన్ ఈ మధ్య తరచూ వాడుతున్న మాట కవాతు. భారత రాజకీయాల్లో యాత్రలు వున్నాయి గానీ కవాతులు లేవు. దండి సత్యాగ్రహం సమయంలో “దండి మార్చ్ “ అన్న మాట జాతిపిత గాంధీ వాడారు. అయితే అప్పటి సందర్భం వేరు. అయితే ఈ కవాతులు తీవ్ర ప్రభావాన్ని చూపింది మాత్రం యూరోప్ దేశాల రాజకీయాల్లోనే. అక్కడ ఫ్రెంచ్ విప్లవం సహా వివిధ విప్లవాల్లో కవాతులు తీవ్ర మార్పులకి దోహదం చేశాయి. కానీ అప్పుడు అక్కడ ఆ రాజరిక వ్యవస్థల్ని దింపడానికి సామాన్యుల అస్త్రం అది. అయితే ఆ విప్లవాలకు సంబంధించిన పుస్తకాలు చదివిన ప్రభావం ఏమో గానీ కవాతు మాటని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు విశాఖలో ఇంకో కవాతు చేస్తున్నారు. విప్లవం మీద ఆసక్తి అంటే అందుకు సంబంధించిన మాటలు వాడితే సరిపోదు. విధానపరంగా రాజకీయ వ్యవస్థలో లోపాల్ని సరిదిద్దేందుకు గట్టి సంకల్పం కావాలి. అందుకు కఠోర కసరత్తు అవసరం. అవేమీ లేకుండా కేవలం విప్లవానికి సంబంధించిన టెర్మినాలజీ వాడినంత మాత్రాన మ్యాజిక్ జరిగిపోదు. జనసేనని నడుపుతున్న తీరు అందుకు పెద్ద ఉదాహరణ.