Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉద్దానం పేరు చెప్తే గుర్తొచ్చేది కిడ్నీ సమస్య. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా వాసులను కబలిస్తూ వస్తోంది ఈ సమస్య. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉద్దానం వాసుల ఉసురు తీస్తోంది ఈ కిడ్నీ మహమ్మారి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు… కిడ్నీ వ్యాధి ఊపిరాడనీయడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కిడ్నీ వ్యాధి విజృంభిస్తోంది. ఉద్దానంలోని ప్రతి ఇంట్లో… ఒక్కరైనా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లుంటారు. ఒక్కరైనా మంచానికే పరిమితమై ఉంటారు. ఒక్కో ఇంట్లో… కిడ్నీ వ్యాధి బారిన పడిన వాళ్ల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ముందు నుండీ ప్రభుత్వాలు అంతగా పట్టించుకున్నా లేకున్నా పవన్ కొంతమేరకు ప్రభావం చూపాడు అని చెప్పాలి.
ఎప్పుడయితే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం దృష్టికి పవన్ ఈ విషయాన్ని తీసుకు వెళ్ళాడో అప్పటి వరకు కేవలం వైద్య సహాయం మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఒక్కో కిడ్నీ వ్యాధిగ్రస్తునికి 2500 పెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది. అయితే తదుపరి పరిణామాల్లో పవన్ తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్నాక జనసేన పోరాట యాత్ర అంటూ మొదలెట్టిన ఆయన మరలా ఆయా ప్రాంతంలో పర్యటిస్తూ ఎంత మంది నేతలు వస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడి ప్రజల బ్రతుకుల్లో మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడివారికి అన్నివిధాలా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఈ విషయమై చర్చించానని, అంతేకాక అమెరికా కూడా వెళ్లి అక్కడి డాక్టర్లను ఇక్కడి సమస్య వివరిస్తే వారు కూడా దయార్ధహృదయంతో సాయం చేస్తామని చెప్పారు, కానీ ప్రభుత్వం ఆ తరువాత ఈ సమస్యను పట్టించుకోకుండా పక్కన పెట్టిందని, ఇక తన సహనం నశించిందని అందుకే రానున్న 48 గంటలలోగా ఆరోగ్య శాఖామంత్రి గారు, అలానే హెల్త్ సెక్రటరీ ఉద్దానం కిడ్నీ బాధితులకు అవసరమైన సాయం అందించడానికి ముందుకు రావాలని, లేకుంటే 48 గంటల తర్వాత తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పవన్ హెచ్చరించారు. అయితే తెలుగుదేశం నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో తాను దీక్షకి దిగుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ తరుణంలో విజయ్ కుమార్ అనే కిడ్నీ వ్యాధి నిపుణులు ఈ ఉద్దానం సమస్య మీద స్పందించారు వారి స్పందన ఏంటో మీరూ చూడండి.
” నేను ఒక కిడ్నీ వ్యాధి నిపుణుడిని నాకు ఈ రంగంలో 23 యేళ్ల అనుభవం ఉంది కానీ నన్ను గెలిపిస్తే లేదా నా దగ్గర 5గురు లేదా 6గురు ఎమ్మెల్యేలు ఉంటే నేను ఈ సమస్యని వెంటనే నేను పవర్ లోకి రాగానే పరిష్కరిస్తాను అని పవన్ కల్యాణ్ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కిడ్నీ వ్యాధి పేరు క్రానిక్ రెనల్ ఫయిల్యూర్ ఇది ఒక భయంకరమైన వ్యాధి! ప్రపంచం మొత్తం ప్రతీ సంవత్సరం 35 మిలియన్ మందిని చంపుతున్న జబ్బు, ఇది ఒక్క ఉద్దానం లోనే కాదు ఇంకా చాలా చోట్ల ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ! ఈ ఉద్దానం కిడ్నీ జబ్బు అనేది ఒక’ కారణం తెలియని జబ్బుగా’ తేల్చి చెప్పింది, అది కూడా ఆషామాషీగా కాదు! ఎన్నో పరిశోధనలు ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఐసీఎమార్, బాబా రీసర్చ్ సెంటర్, హార్వార్డ్ విశ్వవిద్యాలయం లాంటివి చేసిన తర్వాత.
ఆలాగే ఈ ఉద్దానం లాంటి స్థలాలు, వీటిని టెక్నికల్ భాషలో ‘పాకెట్లు’ అంటారు, ఇవి ప్రపంచం మొత్తం లో అమెరికాలో బ్రెజిల్లో శ్రీలంకలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఈ జబ్బు రావడానికి గల ఎలాంటి కారణము ఇపటి వరుకూ కనిపెట్టలేక పోయారు. ఉద్దానం ఒక్క చోటే కాకుండా ఆంధ్రా మరియూ తెలంగాణాలో ఇంకా ఎన్నో గూడాలూ, తండాలలో ఈ జబ్బు బాగ ప్రబలిన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రజలు ఇక్కడినించి వేరే చోటకి వెళ్లటానికి ఇష్టపడక పోవడమే దీనికొక పెద్ద కారణమనిపిస్తుంది. ‘క్రానిక్ రీనల్ ఫైల్యూర్’ అనేది ఒక కాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి రోగిని పీల్చి పిప్పి చేస్తుంది. కానీ దీని గురించి జనాలకి బాగానే తెలుసు, దీన్ని తగ్గించడానికి రక రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, మందులు, ‘హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిసి, కిడ్నీ మార్చడం’ లాంటివి. ఆది ఉద్దానం కావొచ్చు ప్రపంచంలో ఇంకెక్కడైనా కావొచ్చు కానీ ట్రీట్మెంటు మాత్రం ఇదే.
ఈ జబ్బు కూడా కాన్సర్ లాగా ప్రతీ సంవత్సరం చాలా మంది ప్రాణాలు తీసే మహమ్మారి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద శ్రద్ధ వహించి ఇప్పటికే ఈ కిడ్నీ పాడైన పేషెంట్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ పధకం కింద ఉచితంగా వైద్యం చెయ్యడమూ, నెలకి 2500 రూపాయల పెన్షను ఇవ్వడమూ చేస్తోంది. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేసి ఈ మహమ్మారి లాంటి జబ్బు బారిన పడ్డ వాళ్లని ఇంకా క్షోభ పెట్టకండి. ఈ క్రానిక్ రెనల్ ఫయిల్యూర్ కన్నా ఇంకా భయంకరమైన జబ్బు ఒకటి ఉంది దాని పేరు ‘ఫ్లోరసిస్’, అది ఫ్లొరిన్ ఎక్కువున్న తాగు నీటి వల్ల వస్తుంది, ఈ జబ్బు తెలంగాణాలో ఎక్కువగా ఉంది, ఫ్లొరిన్ తక్కువున్న నీళ్ళు సరఫరా చేస్తే ఈ జబ్బు తగ్గించొచ్చు. మన పీకే గారు తెలంగాణాలో ఈ విషయం గురించి పొరాటం చేస్తే బాగుంటుంది. దేశం మొత్తం లో కానీ, మిగతా రాష్ట్రం మొత్తం మీద కానీ మనము కానీ లెక్కలు పోల్చి చూస్తే ఆంధ్రాలో పది యేళ్లల్లో 2500 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక పెద్ద సంఖ్య కానే కాదు ఎందుకంటే ఈ సంఖ్య దేశం మొత్తం లో చూస్తే లక్షల్లో ఉంటుంది.
కంట్రొల్ లో లేని షుగర్ లెవెల్స్, అంటే డయబీటిస్, నొప్పులు తగ్గించే మాత్రలని, పెయిన్ కిల్లర్స్, అతిగా వాడడం ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీస్కోవడం లాంటివి ఈ జబ్బు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు. అలానే ఈ జబ్బు ఇలానే ట్రీట్ చెయ్యాలీ అనే రకమైన విధానం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇది ప్రతీ పేషెంటుకీ మారుతూ ఉంటుంది. నేను ఈ జబ్బుకి శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని ఎవరన్నా చెప్పడం, అది కూడా అసలు వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తి చెప్పడం అనేది ఒక రకమైన ఫూలిష్ నెస్ తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ ఒక కొత్త రీసర్చ్ లేదా పరిశోధన మొదలు అయ్యిందనుకుందాం, కానీ అది కూడా మొదటి ఫలితాలను ప్రకటించడానికి కూడా కొన్ని సంవత్సరాలు తీస్కుంటుంది.
ఈ జబ్బు అనేది 2001 నుంచి బాగా తెల్సిన జబ్బే అంతే కాకుండా ఈ వుద్దానం కిడ్నీ ఫెయిల్యూర్ మీద చాలా పేపర్లు ప్రచురించారు! చాలా మంది ఈ విషయం మీద పరిశోధనలు చేసే వాళ్లని సంప్రదించడం కూడా జరిగింది. కానీ అసలు ఈ జబ్బు రావడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏముందో ఎవరూ కనిపెట్టలేక పోయారు. అంటే కిడ్నీ వ్యాధి నిపుణులు అయిన విజయ్ కుమార్ గారి ప్రకారం ఈ సమస్యకు నివారణ లేదు కేవలం సదరు ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే చోటకి తరలించడం తప్ప, అలా చేస్తే వచ్చే తరాలు అయినా ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండచ్చు. కానీ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకి వెళ్లేందుకు అక్కడి వారు సుముఖత చూపేలా పవన్ వారిని అభ్యర్దిస్తే ఉపయోగం ఉండచ్చు కానీ ఇలా ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అంటే ఎలా అని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.