Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలని టీడీపీ గట్టి ప్రయత్నాలే చేసిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా బహిరంగంగా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక ఏపీ ఉప ముఖ్య మంత్రి కె ఈ కృష్ణమూర్తి బెంగూళూరు పర్యటన సందర్భంగా బీజేపీని ఓడించాలని అక్కడి తెలుగు ప్రజలను కోరారు. చంద్రబాబు సర్కారుని ఎలా అయినా ఇరుకున పెట్టాలి అని అనుకుంటున్నా ఎందుకో బీజేపీ వెనకడుగు వేస్తూ వచ్చిందనే చెప్పాలి. దానికి కారణం ఆపరేషన్ గరుడ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
మే 15 తర్వాత చంద్రబాబుకి తిప్పలు తప్పవు అంటూ జీవీఎల్ నరసింహారావు మొదలు రాం మాధవ్, సోము వీర్రాజు చేస్తున్న హెచ్చరికలు అమల చేసే టైం వచ్చినట్టే ఉందని విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఏపీ ప్రజల ముందు తమను దోషులుగా నిలబెట్టడం ఒకెత్తు అయితే… కర్ణాటకలో రాజకీయంగా తమను చంద్రబాబు దెబ్బతీసే ప్రయత్నాలు చేయటాన్ని ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చాలా సీరియస్ గా తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వటంలేదని చేస్తున్న ప్రచారంపై బీజేపీ అధిష్టానం చాలా గుర్రుగా ఉందట. ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్ వంటి అంశాలను మాత్రం హామీ ఇచ్చి విస్మరించారు బీజేపీ నేతలు. అయినా కూడా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి… చివరి నిమిషంలో మాట మార్చి ఇప్పుడు తమను దోషులుగా నిలబెట్టడం ఏమిటనేది బీజేపీ నేతల వాదన. అయితే సినీ నటుడు శివాజీ చెప్పినట్టు జగన్-పవన్-బీజేపీ కలయికతో ఆపరేషన్ గరుడ మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది.
చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష విమర్శలకి దిగడం దానిని బలపరుస్తోంది. చిత్తూరు లో పర్యటించిన పవన్ చిత్తూరులోని హై రోడ్ వెల్పేర్ ఆప్షన్ బాధితుల పక్షాన అండగా నిలుస్తానని ప్రకటించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదు కానీ మిగిలిన జిల్లా ప్రజలను ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పేద ప్రజలకు న్యాయం చేయాలని… డబ్బున్న వ్యక్తికి ఓ న్యాయం… పేదోడికి ఓ న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అని ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. అనంతరం ఆయన బాధితులతో కలసి దుర్గానగర్ నుంచి గాంధీ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యాకర్తలు తరలివచ్చారు. అధికార టీడీపీ నేతలే మాకు న్యాయం చేయండి అని నా దగ్గరికి వచ్చారని పవన్ పేర్కొన్నారు. అటు మోదీనీ కానీ ఇటు జగన్ ని కానీ పల్లెత్తు మాట కూడా సాగిన పవన్ రోడ్ షో ని చూస్తే ఆపరేషన్ గరుడని పవనే లాంచ్ చేశాడా ? అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా మున్ముందు జరిగే పరిణామాలని ఏవిధంగా బాబు ఎదుర్కుంటాడో మరి…






