Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీ ఆవిర్భావ సభలో తాను టీడీపీ కి కొమ్ము కాయడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీ మీద దాడే. చంద్రబాబు, లోకేష్ టార్గెట్ అని రాజకీయ ఓనమాలు తెలిసిన వాళ్ళు అందరికీ అర్ధం అయ్యింది. ఈ ఒక్క సభతో టీడీపీ కి తొత్తులా వుండే అవసరం తనకు లేదని పవన్ నిరూపించుకోవడం గురించి వైసీపీ సంబరపడుతోంది. కానీ ఈ సభ గురించి పవన్ ప్రకటన చేసినప్పుడు ఒక్క జనసేన కార్యకర్తలే కాదు, మొత్తం ఆంధ్ర ప్రజానీకం అంతా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం మీద గొంతు ఎత్తుతారని భావించారు. అందుకు కారణం సందర్భం. ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు. కానీ ఆశ్చర్యంగా ప్రధాని మోడీ పేరే పవన్ ఎత్తలేదు. బీజేపీ తో చాటుమాటు రాజకీయాలు చేస్తున్న వైసీపీ సైతం మోడీ గురించి కాకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తోంది. కానీ పవన్ ఒక్క అరుణ్ జైట్లీ కే పరిమితం కావడం వెనుక కారణాలు గురించి ఎన్నెన్నో వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ తిరుగుబాటుతో ప్రతీకారంతో రగిలిపోతున్న బీజేపీ పవన్, జగన్ లను ఉపయోగించుకొని టీడీపీ ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. హోదా కోసం జగన్, పవన్ లు పోరాడుతున్నట్టు ప్రజల్లో ఒక వాతావరణం కల్పించి ఆపై ఎంతోకొంత రాష్ట్రానికి ఇచ్చి అందులో చంద్రబాబు కి ఏ పాత్ర లేదని నిరూపించడానికి బీజేపీ ప్రయత్నం. అందులో భాగం గానే పవన్ ఆమరణ దీక్ష గురించి మాట్లాడినట్టు సనాచారం. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పవన్ ఆమరణ దీక్షకు దిగితే ఆ సమయంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను సాంకేతికంగా ఎదుర్కోవాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఆ పోరాటం మాత్రం కేంద్రాన్ని ఉద్దేశించింది. అది కూడా ఓ విధంగా బాబుని ఇబ్బంది పెట్టడానికే. నిజానికి ఇలాంటి పోరాటం చేయదలిస్తే కార్యస్థలాన్ని ఢిల్లీ లో ఎంచుకోవడం సహజం. అయితే తమ పోరాటం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందని పవన్ ప్రకటించడం కూడా ఓ డౌట్ రేకెత్తిస్తోంది. మొత్తానికి నిన్నటిదాకా బాబుని, ఇప్పుడు మోడీని ఎందుకు వదిలేస్తున్నారు అన్న ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పాలి. కానీ ఆ ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చే అవకాశమే లేదు. ఎవరికి వారు ఏమి జరిగి ఉంటుందో ఊహించుకోవాలి… అంతే.