Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా వచ్చిన ప్రకటన సంచలనం రేపింది. అయితే కొద్దిసేపటికే ఆ స్టేట్ మెంట్ ని ఖాతా నుంచి తొలిగించడంతో అసలు ఏమి జరిగిందో అర్ధం కాక జనసేన శ్రేణులతో పాటు సామాన్య జనం అయోమయంలో పడుతున్నారు. దీనిపై జనసేన మీడియా వర్గాలు వివరణ ఇచ్చాయి. పార్టీ సోషల్ మీడియా విభాగంలో కొత్తగా చేరిన ఓ వ్యక్తి చేసిన పొరపాటుగా దీన్ని తేల్చాయి. జనసేన సోషల్ మీడియాలో అంతర్భాగమైన శతఘ్ని డిజిటల్ రెజిమెంట్ ప్రతినిధుల సమావేశం కొన్ని రోజుల కిందట జరిగింది. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా అని ఓ వ్యక్తి ప్రశ్నించినప్పుడు, అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం ఉంటుందని పవన్ జవాబు ఇచ్చారు. ఆ జవాబుని తప్పుగా అన్వయించుకున్న వ్యక్తి ” వచ్చే ఎన్నికల్లో పార్టీకి బలం ఉందనుకుంటే మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధం” అని ట్వీట్ చేయడంతో అంతటా అదే హాట్ టాపిక్ అయిపోయింది.
నిజానికి ఇదేదో ఓ వ్యక్తి పొరపాటు వల్ల జరిగింది అనుకున్నా అది పాక్షిక సత్యమే. ఎందుకంటే …అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం అన్న వాళ్ళు దానికి కొనసాగింపుగా అప్పుడు బలం ఉందనుకుంటే మొత్తం 175 స్థానాల్లో పోటీ చేద్దాం అనే అవకాశాలు ఎక్కువ. సరే ఆ మాట పవన్ కళ్యాణ్ అనలేదు అనుకున్నా కూడా అది భావ్యం కాదు. ఇంకో ఏడాది లేదా ఏడాదిన్నర లో ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా పార్టీ బలం ఎంత అనేదానిపై అధినేతకు ఇంకా అవగాహన లేకపోవడం అన్నది కచ్చితంగా లోపమే. పైకి చెప్పినా చెప్పుకున్నా పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఇంకా క్లారిటీ లేకుండా మాట్లాడడం ఓ కొత్త పార్టీకి మైనస్సే. పోటీ మాట ఎలా వున్నా పార్టీ బలాలు, లోపాల మీద జనసేన పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవడం అవసరం.