పొత్తులపై పవన్ కొత్త ఫార్ములా, టీడీపీలో టెన్షన్ – ఢిల్లీ కేంద్రంగా..!!

Pawan Kalyan
Pawan Kalyan

జనసేనాని పవన్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతామని స్పష్టం చేసారు.

పవన్ కీలక వ్యాఖ్యలు:
పవన్ కల్యాణ్ విశాఖ కేంద్రంగా పొత్తులపైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీని ఓడిస్తామనే తన లక్ష్యాన్ని వివరిస్తూనే పొత్తులు..ప్రభుత్వ ఏర్పాటు పైన కొత్త చర్చకు కారణమయ్యారు. పొత్తులపై ఆసక్తి కర ఫార్ములా బయటకు తీసుకొచ్చారు. వచ్చేది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా.. లేదంటే మిశ్రమంగా టీడీపీతో జనసేన కలిసిన సంకీర్ణ ప్రభుత్వమా అనే అంశంపై, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.దీని ద్వారా అనేక సందేహాలు మొదలయ్యాయి. పవన్ ఆశిస్తున్నట్లుగా బీజేపీ, జనసేన,టీడీపీ కూటమిగా ఏర్పడే అవకాశాలు లేవనే అభిప్రాయానికి పవన్ వచ్చారా అనే చర్చ మొదలైంది.గతంలో పవన్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన , ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీసాయి.

జనసేనాని కొత్త ఫార్ములా:
బీజేపీ, జనసేన ప్రభుత్వం అంటూ పవన్ తొలి సారి వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు టీడీపీలోనూ అనుమానాలు పెంచుతోంది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి జనసేనను ఆహ్వానించిన బీజేపీ, పాత మిత్రుడు చంద్రబాబును పిలవలేదు. అయితే, ఈ 2014 తరహాలో ఏపీలో రెండు పార్టీలను కలిపి పొత్తుల దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టు పెంచుకొనేలా..కీలక పాత్ర:
జనసేనకు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా 25 సీట్లకు పరిమితం చేయాలని టీడీపీ భావిస్తోంది. జనసేన నుంచి సాధ్యమైన మేర సీట్లు సాధించాలనే అభిప్రాయంతో ఉంది. ఈ క్రమంలో జనసేనతో టీడీపీ పొత్తు అవసరాన్ని తమ అవకాశంగా మలచుకోవాలనేది పవన్ ఆలోచనగా స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇటు టీడీపీ , అటు బీజేపీతోనూ పవన్ రాజకీయంగా కొత్త ఫార్ములాతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకపోతే..చివరకు పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.