Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సభల్లోనే మీకు ఏ సమస్య వచ్చినా మీ తరపున ప్రశ్నిస్తా అని జనానికి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీకి తగినట్టు పవన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడం లేదని విమర్శలు వస్తూనే వున్నాయి. అయితే కేవలం రాజకీయ విమర్శలు చేయడం మాత్రమే తన పని కాదన్నట్టు వ్యవహరించిన పవన్ ఆ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించదు. అయితే నేడు విశాఖ పర్యటనలో మాత్రం పవన్ బాణీ మారినట్టు స్పష్టంగా కనిపించింది.
విశాఖ పర్యటనలో 2014 ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీని పవన్ స్వయంగా ప్రజలకు గుర్తు చేశారు. అందుకు తగ్గట్టు డ్రెడ్గింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరణ, విశాఖకు రైల్వే జోన్ అంశాలను పవన్ ప్రస్తావించారు. ఈ విషయాల్లో విఫలం అయ్యారంటూ విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను పవన్ టార్గెట్ చేశారు. వాళ్ళు ఇద్దరూ ప్రజాప్రతినిధులుగా చేయాల్సింది చేయకపోవడం వల్ల మౌనం వీడి ప్రశ్నించడానికి వచ్చినట్టు పవన్ చెప్పారు. మొత్తానికి టీడీపీ , బీజేపీ లకు చెందిన ఇద్దరూ ఎంపీలను టార్గెట్ చేయడం ద్వారా జనసేన 2019 నాటికి ఏ వైఖరి తీసుకుంటుంది అన్నదానిపై పవన్ ప్రాధమిక సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.