Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అనే నానుడి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈయన గారు పీసీసీ అధ్యక్షుడిగా పనికి రారని సొంత జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చిందులు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అయితే, గియితే కోమటిరెడ్డి బ్రదర్స్ ని రాజకీయంగా ఎదుర్కోడానికి ఏమి చేయాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచించుకోవాలి. కానీ ఆయన కోపం కోమటిరెడ్డి బ్రదర్స్ కామెంట్స్ కి ప్రాధాన్యం ఇస్తున్న విలేకరుల మీదకి మళ్లింది. పైగా కొందరు జర్నలిస్టులు కోమటిరెడ్డి బ్రదర్స్ కి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కి కడుపు మండిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ ఛానల్ తెస్తున్న అంశాన్ని అనువుగా మార్చుకుని ఇప్పటికే టాప్ 5 లో ఒకటిగా వున్న ఓ ఛానల్ యజమానికి ఫోన్ చేసి మీ జర్నలిస్ట్ వాళ్లకి అనుకూలంగా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ జర్నలిస్ట్ ని ఉద్యొగం నుంచి పీకే దాకా ఊరుకోలేదు. ఆ ఛానల్ యజమాని కూడా తానా తందానా అనడంతో ఆ జర్నలిస్ట్ ఉద్యోగం ఊడిందట.
అప్పటికీ ఉత్తమ్ గారి కోపం చల్లారలేదట. ఉద్యోగం పోయిన జర్నలిస్ట్ స్నేహితుడు ఇంకో ఛానల్ ప్రతినిధిగా పనిచేస్తుంటే అతని మీద కూడా కన్నేశాడు. ఆ ఛానల్ యజమానికి కూడా ఫిర్యాదు చేసాడు. ఇంకా ఉరుకుంటే లాభం లేదని జర్నలిస్టులు విషయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దృష్టిలో వేశారు. ఉత్తమ్ పద్ధతి మార్చుకోకపోతే జర్నలిస్టులు కాంగ్రెస్ కి తెలంగాణాలో పాతర వేస్తారని ఏఐసీసీ కి హెచ్చరిక చేశారు. మేలుకున్న ఢిల్లీ పెద్దలు ఉత్తమ్ కి చీవాట్లు వేయడంతో పాటు సదరు జర్నలిస్ట్ కి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఆదేశించారట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తమ్ ఆ విలేకరికి తిరిగి జాబ్ వేయించాల్సి వచ్చిందట. ఏమి చేస్తాం …అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురు అవుతాయి.