Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Prakash Raj Character In Mahanati Movie
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మహానటిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. రెండు దశాబ్దాల పాటు తిరుగులేని విజయాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలిన సావిత్రికి కెరీర్ ఆరంభంలో అవకాశాలను, విజయాలను అందించిన నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నట్టు సమాచారం. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కాలంలో సావిత్రిలోని ప్రతిభను గుర్తించి ఆమెను ప్రోత్సహించిన వారిలో చక్రపాణి ముందువరుసలో ఉంటారు.
విజయా బ్యానర్ పై నాగిరెడ్డి-చక్రపాణి కాంబినేషన్లో వచ్చిన అనేక సినిమాల్లో సావిత్రి నటించారు. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ వంటి చిత్రాలు సావిత్రికి ఎంతో పేరు తెచ్చిపెట్టటమే కాక తెలుగు సినిమా ఇండస్ర్రీలో ఎవర్ గ్రీన్ హిట్లుగా నిలిచిపోయాయి. తన కెరీర్ కు ఎన్నో విధాల తోడ్పాటునందించిన చక్రపాణి అంటే సావిత్రి గురుభక్తితో ఉండేవారు. అందుకే ఆమె జీవిత చరిత్రలో ఈ పాత్ర కీలకమని భావిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకాశ్ రాజ్ లాంటి విలక్షణ నటుణ్ణి ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయింది.
సావిత్రి పాత్రలో కీర్తిసురేష్, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో మళయాల హీరో దుష్కర్ సల్మాన్ నటిస్తున్నారు. సమంత మరో కీలకమైన పాత్ర చేస్తున్నారు. అలనాటి హీరోయిన్ జమున పాత్రను సమంత పోషిస్తున్నారనే ప్రచారం జరగుతోంది. ప్రస్తుతం ఆనాటి కాలానికి సంబంధించిన ప్రత్యేకమయిన సెట్ వేసి అందులో షూటింగ్ జరుపుతున్నారు. జీవితంలో ఉఛ్చస్థితిని అనుభవించి అక్కడి నుంచి అధః పాతాళానికి పడిపోయిన సావిత్రి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో సంగతులను మహానటి ద్వారా తెరపై ఆవిష్కరింపచేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.