Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల్లో గెలుపు తర్వాత బీజేపీ దృష్టి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కర్నాటకపై పడింది. దక్షిణాదిన బీజేపీకి బలమున్న ఏకైక రాష్ట్రం కర్నాటకే. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీని గెలుపుతీరాలకు చేర్చగా..కర్నాటక బాధ్యతను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వీకరించినట్టు కనిపిస్తోంది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధ్యక్షతన జరిగిన పరివర్తన ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా యోగి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎన్నికలే లక్ష్యంగా ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్నాటకలో జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు, ఆయనకు పోటీగా టిప్పుసుల్తాన్ బరిలోకి దిగుతున్నారని యోగీ వ్యాఖ్యానించారు.
కర్నాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, కానీ కాంగ్రెస్ మాత్రం ఆయనను పూజించకుండా.. టిప్పుసుల్తాన్ జన్మదిన వేడుకలను జరుపుతోందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ ను స్వాతంత్య్ర సమరయోధుడిగా చెబుతున్న కాంగ్రెస్ ను హనుమంతుడు ఓడిస్తాడని విశ్వాసం వ్యక్తంచేశారు. కర్నాటక ప్రభుత్వ పాలనపైనా యోగీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. ఓ వైపు బీజేపీ కార్యకర్తల ఆత్మహత్యలు జరుగుతోంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అటు యోగీ వ్యాఖ్యలపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇటీవలికాలంలో ప్రధాని మోడీపైనా, బీజేపీప్రభుత్వంపైనా జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో విమర్శలు గుప్పిస్తున్న ప్రకాశ్ రాజ్ యోగీ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. యోగి పేరిట ట్విట్టర్ లో ఓ లేఖను పోస్ట్ చేశారు. విద్వేషాలు, మత సామరస్యాన్ని నాశనం చేసే భావజాలాన్ని కర్నాటకలో ఎందుకు వెదజల్లుతున్నారని లేఖలో ప్రశ్నించారు. తాను పోస్ట్ చేస్తున్న ఫొటోలను జాగ్రత్తగా గమనించాలని, కొన్నేళ్ల క్రితం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడాలని కోరారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రకాశ్ రాజ్ యోగీని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడం కోసం మత పరంగా ప్రజలను రెచ్చగొట్టడం తప్ప జనాల సమస్యలు పట్టడం లేదా అని మండిపడ్డారు.