Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన సినిమాలు తాను చేసుకుంటూ మోడీ ని విమర్శించదానికి ఏమాత్రం వీలున్నా వదలని ప్రకాష్ రాజ్ మరో సారి మోడీ మీద తన నిరసన గళం విప్పారు. మోడీని తాను ప్రశ్నిస్తూన్నందుకు తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ ఒక టివి ఛానల్ తో మాట్లాడుతూ చంద్రబాబు మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అక్కడి ప్రజలను మోడీ వంచించారని విమర్శించారు. అందుకే కర్నాటక ఎన్నికల్లో తెలుగువారు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరిగా రాష్ట్రానికి ఏదో చేయాలని తపన పడుతున్నారని, హోదా విషయంలో ఆంధ్రులకు ఘోర అన్యాయం జరిగిందని… హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారన్నారని ప్రకాష్ రాజ్ అన్నారు.
అంతే కాదు… జర్నలిస్టుల హత్యలు జరుగుతున్నా… చేతగాని స్థితిలో బీజేపీ సర్కార్ ఉండటం విచిత్రంగా ఉందన్నారు. ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని సినీనటుడు ప్రకాశ్ రాజ్ కితాబునిచ్చారు. కానీ చంద్రబాబుకు కేంద్ర నుంచి సాయం అందక నిస్సహాయంగా ఉన్నారని, జీరోగా ఉన్న ఏపీకి ఏదో ఒకటి చేయడానికి చంద్రబాబు కష్టపడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని ప్రస్తావించిన తీరు హాట్ టాపికైంది. ఎలాంటి సాయం అందకపోతే చిన్నపిల్లాడిగా ఉన్న ఏపీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు.
అలాగే పవన్ కళ్యాణ్ మీదా ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ వలస నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనాలకు మంచి చేయాలనే ఆలోచనతోనే పవన్ పార్టీ పెట్టారని.. పేరు కోసం పెట్టలేదన్నారు. కావలసినంత పాపులారిటీ, డబ్బు పవన్ దగ్గర ఉన్నాయని తెలిపారు. అలాగే పవన్ మాటలలో ఆవేదన ఉందని, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని భావించారని, తాను పార్టీ పెట్టకుండా సేవ చేస్తున్నానని అన్నారు. పవన్ మంచి చేయడానికి వచ్చాడని మంచి చేసేవారిని ముంచివేయడం చాలా సులభమని, ఆయన ఏం చేస్తారో చూడాలని అభిప్రాయపడ్డారు. జనాల్లో చైతన్యం తీసుకురావాలని… దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పడంతో బీజేపీకి దిక్కుతోచడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు.