27 సెకన్ల వీడియోతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోవడం ఎవరికన్నా సాధ్యమవుతుందా…? ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడమే కాకుండా…సోషల్ మీడియా తన పేరు జపించేలా చేయడం ఊహకందే విషయమేనా…? ఇంతకుముందయితే నమ్మేవారం కాదేమో కానీ మళయాళ ముద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్ వారియార్ ను చూసిన తర్వాత మాత్రం నమ్మకతప్పని పరిస్థితి. ఒరు అదార్ లవ్ సినిమాలోని మణిక్య మలరాయ పాటలో కళ్లతో పలికించిన హావభావాలు ప్రియ ప్రకాశ్ వారియార్ కు అమాంతం స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.
ఆ పాటలో ఆమె కన్నుకొట్టిన తీరుచూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. రెండు రోజుల నుంచి సోషల్ మీడియా స్టార్ ఆమే. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియాలూ ప్రియ ప్రకాశ్ వారియర్ పేరుతో మారుమోగుతున్నాయి. రెండు రోజుల్లోనే 45 లక్షల మంది ఈ వీడియో చూశారంటే ప్రియ ఫాలోయింగ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఆమె కన్ను గీటిన వీడియోకు స్టార్ హీరోల రియాక్షన్లతో స్పూఫ్ లు ఇస్తున్నారు నెటిజన్లు. ఆమెను చూసి క్రికెటర్లు క్యాచ్ లు వదిలేస్తున్నట్టున్న వీడియోలు నవ్వుతెప్పిస్తున్నాయి. త్రిస్సూర్ లో డిగ్రీ చదువుకున్న ప్రియ ఒరు అదార్ లవ్ సినిమాతోనే తెరంగేట్రం చేస్తోంది.