పక్కా ప్లానింగ్‌ లేకుంటే ఇలాగే ఉంటుంది

Problem Behind Rajinikanth Robo 2. 0 movie Graphic Works Pending

భారీ చిత్రాలు చేసే సమయంలో పక్కా ప్లానింగ్‌ లేకుంటే ఏం జరుగుతుందో ‘2.0’ చిత్రాన్ని చూస్తుంటే అర్థం అవుతుంది. దర్శకుడు శంకర్‌ గతంలో పలు భారీ చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాల సమయంలో లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఆయన పడుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో చేయాలనే ఉద్దేశ్యంతో శంకర్‌ ఎక్కువగా గ్రాఫిక్స్‌ను వాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగా షూటింగ్‌ జరపలేదు. దాంతో ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా అంటే చాలా ఆలస్యం అవుతున్నాయి.

‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి షూటింగ్‌కు ముందే పక్కా ప్రణాళిక సిద్దం చేశాడు. అన్ని విధాలుగా ప్లాన్‌ చేశాడు. ప్రతి విషయంలో కూడా డీటైల్డ్‌గా అధ్యయనం చేయడంతో పాటు, అప్పుడు ఎదురు కాబోతున్న సమస్యలను కూడా ముందే తెలుసుకుని, అవి ఎదురు అయితే ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలను కూడా రాజమౌళి ప్లాన్‌ చేసుకున్నాడు. దాంతో బాహుబలి వంటి భారీ సినిమా, అంతగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న సినిమా అనుకున్న సమయంలోనే పూర్తి చేయగలిగాడు. కాని శంకర్‌ మాత్రం సినిమా భారీగా తీయాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు, పలు సార్లు గ్రాఫిక్స్‌ సీన్స్‌ను మార్చడం జరిగింది. దాంతో ఇప్పుడు సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో అనుకున్న రజినీకాంత్‌ ‘2.0’ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో అయినా విడుదల అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌ టెక్నాలజీతో ఈ సినిమాను శంకర్‌ ప్లాన్‌ చేశాడు. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదలైతే వెయ్యి కోట్లు ఈజీగా రాబట్టగలదు. కాని విడుదల అవ్వడమే కష్టంగా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.