Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ పట్ల త్రిపురలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరుతో ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో బీజేపీలోనే మోడీ కి వ్యతిరేకంగా ఓ వర్గం రగిలిపోతోంది. అయితే నేరుగా ఆయన్ని ఢీకొట్టే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ అసంతృప్తిని ఎక్కువ కాలం నిలవరించలేమన్న విషయం మోడీకి అర్ధం అయ్యే టైం వచ్చింది. దేశంలో మోడీ హవా పెంచడానికి ఆ పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగం ఎంతో కృషి చేసిన సంగతి తెలిసిందే. 2014 లో మోడీ గెలుపులో బీజేపీ ఐటీ విభాగానిదే కీలక పాత్ర. ఆ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు అయిన ప్రద్యుత్ బోరా నేడు బీజేపీ కి రాజీనామా చేశారు. బోరా రాజీనామా తో బీజేపీ కి షాక్ తగిలింది.
ప్రద్యుత్ బోరా కేవలం రాజీనామా చేసి ఊరుకోలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి ఘాటైన లేఖ రాశారు. తాను పార్టీలో చేరిన 2004 నాటి పరిస్థితులకి, ఇప్పుడు పరిస్థితులకి ఎంతో తేడా ఉందని బోరా ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా పార్టీ పని చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీలో రాజకీయ, ప్రజాస్వామిక విలువలకి స్థానం లేకుండా పోయిందని బోరా ఆవేదన చెందారు. ఇక బీజేపీ లో అధికారం వల్ల అహంకార ధోరణి వచ్చిందని బోరా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ కి, మిగిలిన రాజకీయ పార్టీలకు తేడా లేకుండా పోయిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్న పార్టీలో కొనసాగలేనని బోరా వివరించారు. బోరా కి మేధావిగా పేరుంది. సీనియర్ లంతా మోడీ ఒంటెత్తు పోకడల్ని ప్రశ్నించడానికి సంశయిస్తున్న తరుణంలో బోరా రాజీనామా ఓ సంచలనం గా నిలిచింది. ప్రద్యుత్ బోరా స్పూర్తితో మరికొందరు సీనియర్ నాయకులు మోడీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.