కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డేకు కడప ఉక్కు సెగ తగిలింది. ఆయన ఈరోజు కడప వచ్చిన సందర్భంగా కడప ఉక్కు ఉద్యమకారుల చేతిలో ఘోర పరాభవం ఎదురయినట్టు తెలుస్తోంది. పోస్టల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు మంత్రి ఈ రోజు కడప వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మంత్రి కారును అడ్డగించిన కమ్యూనిస్ట్ నేతలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. వద్ద ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంత కుమార్ హెగ్డే కదలకుండా లోపలే ఉండిపోయారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే పోలీసులు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలను పక్కకు లాగి పడేశారు. ఈ నేపథ్యంలో అనంత్ కుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారుపై బూటును విసిరారు.