మళ్ళీ మన ముందుకి వచ్చేస్తున్న చంద్రముఖి

మళ్ళీ మన ముందుకి వచ్చేస్తున్న చంద్రముఖి

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాబా’ సినిమాతో దారుణంగా దెబ్బ తిని.. ఆయన మార్కెట్ కూడా పడిపోయిన సమయంలో ఆయన మళ్లీ బలంగా పుంజుకోవడానికి కారణమైన సినిమా ‘చంద్రముఖి’. దక్షిణాదిన హార్రర్ కామెడీకి మంచి ఊపు తీసుకొచ్చిన చిత్రం ఇదే అని చెప్పుకోవచ్చు.

ఎప్పుడో 90ల్లో వచ్చిన మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాళు’ను తమిళ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందించాడు సీనియర్ దర్శకుడు పి.వాసు. ఈ చిత్రానికి కన్నడ, తెలుగు భాషల్లో ఇప్పటికే సీక్వెల్ వచ్చింది. ఐతే కన్నడలో బాగా ఆడిన ఆ సినిమా.. తెలుగులో ‘నాగవల్లి’గా తెరకెక్కి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమిళంలో చంద్రముఖి సీక్వెల్ గురించి ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది కానీ.. ఎంతకీ అది పట్టాలెక్కలేదు. పి.వాసు ఎంత ప్రయత్నించినా రజనీని ఒప్పించలేకపోయాడు.

ఐతే ఎట్టకేలకు తమిళంలో ‘చంద్రముఖి-2’ కన్ఫమ్ అయింది. కాకపోతే ఇందులో హీరోగా నటించేది రజనీకాంత్ కాదు. ఆయన వీరాభిమాని రాఘవ లారెన్స్. దర్శకుడిగా, హీరోగా హార్రర్ కామెడీని మరో స్థాయికి తీసుకెళ్లిన లారెన్స్.. ఇప్పుడు రజనీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు. కరోనా బాధితుల సహాయార్ధం రూ.3 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సందర్భంగా లారెన్స్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఆ డబ్బులు సన్ పిక్చర్స్ వాళ్లు ‘చంద్రముఖి-2’ కోసం ఇచ్చిన అడ్వాన్స్ నుంచి ఇచ్చినవే అతను వెల్లడించడం విశేషం. రజనీ ఆశీస్సులు, అనుమతితోనే తాను ‘చంద్రముఖి-2’లో నటిస్తున్నట్లు అతను వెల్లడించాడు. సీక్వెల్‌ను పి.వాసునే డైరెక్ట్ చేస్తాడని కూడా చెప్పాడు. మరి కన్నడ, తెలుగు భాషల్లో తీసిన సీక్వెల్ కథతోనే ‘చంద్రముఖి-2’ తెరకెక్కుతుందా.. లేదా వేరే కథేమైనా సిద్ధం చేశారా అన్నది తెలియదు. దర్శకుడిగా హార్రర్ కామెడీని పండించడంలో ఆరితేరిన లారెన్స్ తనే డైరెక్ట్ చేయకుండా ఔట్ డేట్ అయిపోయిన పి.వాసుతో ఈ సినిమా చేస్తుండటమే ఆశ్చర్యకరం.